Munugode: పిలవని పేరంటానికి వెళ్లను.. పీసీసీ తీరుపై ఎంపీ కోమటిరెడ్డి ఫైర్‌

మునుగోడు ఉప ఎన్నిక వేళ పీసీసీ తీరుపై ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నిక కార్యక్రమాల గురించి పీసీసీ నుంచి తనకు ఎటువంటి సమాచారం లేదని తెలిపారు. పిలవని పేరంటానికి తాను వెళ్లనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో...

Updated : 12 Aug 2022 17:03 IST

హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నిక వేళ పీసీసీ తీరుపై ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నిక కార్యక్రమాలపై పీసీసీ నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. పిలవని పేరంటానికి తాను వెళ్లనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మునుగోడు ఉప ఎన్నిక గురించి నాతో ఎవరూ మాట్లాడట్లేదు. దాని గురించి నాకేం తెలియదు. చండూరు సభలో ఓ పిల్లాడితో నన్ను తిట్టించారు. మమ్మల్ని అవమానించిన వారు క్షమాపణ చెప్పాలి. సీనియర్‌ను తిట్టిన అతడిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలి. రేపటి కాంగ్రెస్‌ పాదయాత్రకు నన్ను ఎవరూ పిలవలేదు. నన్ను అవమానించిన తర్వాత నేనెలా వెళ్తా?’’ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు.

పాల్వాయి స్రవంతితో ఏఐసీసీ కార్యదర్శులు భేటీ..

మరోవైపు మునుగోడు ఉప ఎన్నికపై దూకుడుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్.. అభ్యర్థి ఎవరన్నది త్వరగా తేల్చే పనిలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా ఆశావహుల్లో కీలకంగా ఉన్న పాల్వాయి స్రవంతిని గాంధీభవన్‌కు పిలిపించారు. ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, రోహిత్ చౌదరి, నదీమ్‌ జావీద్‌లతో స్రవంతి సమావేశమయ్యారు. ఉపఎన్నికకు సంబంధించిన పలు అంశాలపై ఆమెతో చర్చించారు. గత రెండ్రోజులుగా రాష్ట్ర నేతలతో సమావేశమైన ఏఐసీసీ రాష్ట్ర ఇంఛార్జి మాణికం ఠాగూర్.. ఉపఎన్నికకు సంబంధించిన సర్వే అంశాలపై చర్చించారు. దుబ్బాక, హుజూరాబాద్‌ మాదిరిగా కాకుండా ఈసారి అభ్యర్థిని సైతం త్వరగా తేల్చాలన్న పలువురి అభిప్రాయం మేరకు కసరత్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే పాల్వాయి స్రవంతితో ఏఐసీసీ కార్యదర్శులు భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. నిన్నటి వ్యూహరచన కమిటీ సారాంశాన్ని, అభ్యర్థుల ఎంపికపై వెల్లడైన అభిప్రాయాలను ఏఐసీసీ కార్యదర్శులు ఆమెకు వివరించినట్లు సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని