Andhra News: యువగళం.. వారాహి యాత్రల ప్రభావం ప్రజలపై తీవ్రంగా ఉంటుంది: ఎంపీ రఘురామ

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలు, తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువ గళం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్రల ప్రభావం ప్రజలపై తీవ్రంగా ఉండనుందని, దాంతో రాష్ట్రంలో వైకాపా పరిస్థితి రోజుకింత దిగజారిపోయే ప్రమాదం ఉందని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.

Updated : 28 Jan 2023 09:38 IST

ఈనాడు, దిల్లీ: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలు, తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువ గళం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్రల ప్రభావం ప్రజలపై తీవ్రంగా ఉండనుందని, దాంతో రాష్ట్రంలో వైకాపా పరిస్థితి రోజుకింత దిగజారిపోయే ప్రమాదం ఉందని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. దిల్లీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలను రక్షించాలనే ఉద్దేశంతో పవన్‌ కల్యాణ్‌ తెదేపాతో జతకట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారని అన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ పరిస్థితిపై నాలుగైదు నెలల క్రితం తాను సర్వే నిర్వహించి ఫలితాలను వెల్లడించానని, తాజాగా ఐప్యాక్‌ సర్వే నివేదిక ఆ సంస్థ ముగ్గురి డైరెక్టర్లలో ఒకరైన విశాల్‌ సంతకంతో వెలుగులోకి వచ్చిందన్నారు. తన సర్వే నివేదికలో వచ్చిన ఫలితాలే ఐప్యాక్‌ సర్వే నివేదికలోనూ పునరావృతమయ్యాయని పేర్కొన్నారు. 175 స్థానాలకుగాను 30 స్థానాల్లో ఐ ప్యాక్‌ నిర్వహించిన సర్వే ఫలితాల్లో కేవలం 5 స్థానాల్లోనే తమ పార్టీ విజయం సాధిస్తుందని వెల్లడయిందని తెలిపారు. ట్రెండ్‌ ఇలానే ఉంటే తమ పార్టీ 30 స్థానాలు గెలిచే అవకాశం ఉందని, మారుతున్న రాష్ట్ర రాజకీయ పరిణామాలతో అవి కూడా గెలుపొందడం కష్టమేనని ఆయన వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని