MP Raghurama: నాకో నిబంధన.. అవినాష్‌కు మరొకటా?: వైకాపా ఎంపీ రఘురామ

పార్లమెంట్‌ సభ్యులు దాఖలు చేసే పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారిస్తుందన్న నియమావళికి భిన్నంగా కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి అత్యవసరంగా దాఖలు చేసిన పిటిషన్‌ మరో ధర్మాసనానికి వెళ్లడం వెనుక మర్మమేమిటో అంతుచిక్కడం లేదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.

Updated : 11 Mar 2023 08:35 IST

ఈనాడు, దిల్లీ: పార్లమెంట్‌ సభ్యులు దాఖలు చేసే పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారిస్తుందన్న నియమావళికి భిన్నంగా కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి అత్యవసరంగా దాఖలు చేసిన పిటిషన్‌ మరో ధర్మాసనానికి వెళ్లడం వెనుక మర్మమేమిటో అంతుచిక్కడం లేదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ పోలీసులు కుట్ర చేసి తనపై నమోదు చేసిన కేసును సవాలు చేస్తూ తాను దాఖలు చేసిన పిటిషన్‌ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి వెళ్లిందన్నారు. ఎంపీగా రఘురామకృష్ణరాజుకు ఒక నిబంధన.. అవినాష్‌రెడ్డికి మరో నిబంధనా అని ఆయన ప్రశ్నించారు. దిల్లీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అరెస్టు ఖాయమని తేలడంతో అవినాష్‌రెడ్డి తన స్టేట్‌మెంట్‌ను సీబీఐ అధికారులు మార్చే అవకాశం ఉందనే కొత్త వాదనను తెరపైకి తెచ్చారన్నారు. వివేకానందరెడ్డిని ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి హత్య చేయించారంటూ కోర్టులో అభియోగం మోపడానికి అవినాష్‌రెడ్డి ఎవరని ప్రశ్నించారు. వివేకానంద రెడ్డికి రెండో భార్య ఉందని, ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడని, అతనికి రూ. 2 కోట్ల విలువైన ఆస్తి ఇస్తానని వివేకా చెప్పారని అవినాష్‌ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది తెలిపారన్నారు. రూ. 2 కోట్ల ఆస్తి కోసం రూ. 40 కోట్లు ఇచ్చి హత్య చేయిస్తారా అని రఘురామ ప్రశ్నించారు. జగనన్న భూహక్కు పథకంలో భాగంగా రాళ్లను నాటించడానికి, వాటిని రవాణా చేయడానికి సుమారు రూ. 1800 కోట్ల ప్రజాధనం వ్యయం చేస్తున్నారని ఎంపీ రఘురామ విమర్శించారు. తన తండ్రి పేరు, తన బొమ్మ కోసం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నా ప్రజలు ప్రశ్నించకపోవడం విడ్డూరంగా ఉందని చెప్పారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు