Mukul Roy: సొంతగూటికి ముకుల్‌ రాయ్‌

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన భారతీయ జనతా పార్టీకి ఆ రాష్ట్రంలో మరో ఎదురుదెబ్బ తగిలింది.   ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్‌ రాయ్‌ భాజపాను వీడి

Published : 11 Jun 2021 17:04 IST

మమత సమక్షంలో నేడు టీఎంసీలో చేరిక

బెంగాల్‌: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన భారతీయ జనతా పార్టీకి ఆ రాష్ట్రంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్‌ రాయ్‌ భాజపాను వీడి తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో శుక్రవారం ఆయన తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. ముకుల్‌తో పాటు ఆయన కుమారుడు సుబ్రాన్షు కూడా టీఎంసీ కండువా కప్పుకొన్నారు. 

బెంగాల్‌ శాసనసభ ఎన్నికలకు ముందు తృణమూల్‌కు చెందిన పలువురు కీలక నేతలు భాజపాలో చేరిన విషయం తెలిసిందే. అందులో మొట్టమొదటి వ్యక్తి ముకుల్‌ రాయ్‌ కావడం గమనార్హం. మమతా బెనర్జీకి అత్యంత ఆప్తుల్లో ఒకరైన ముకుల్‌.. పార్టీ ప్రారంభం నుంచి కీలకంగా పనిచేశారు. అయితే 2017లో దీదీతో రాజకీయపరమైన విబేధాలు రావడంతో పార్టీకి దూరమయ్యారు. ఈ క్రమంలోనే పార్టీ అనుమతి లేకుండా భాజపా నేతలను కలిసి తృణమూల్‌ అధిష్ఠానం ఆగ్రహానికి గురయ్యారు. ఆ తర్వాత భాజపాలో చేరి, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. 

ఎన్నికల సమయంలోనూ ముకుల్‌ భాజపా తరఫున విస్తృతంగా పనిచేశారు. అయితే గత కొన్ని రోజులుగా తాను పార్టీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, ముఖ్యంగా ఎన్నికల్లో ఓటమి తర్వాత తనపై ఒత్తిడి పెరిగిందని ముకుల్‌ ఆయన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తిరిగి సొంతగూటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న ఆయన.. నేడు టీఎంసీలో చేరారు.

ఇటీవల ముకుల్‌ రాయ్‌ సతీమణి కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో టీఎంసీ ఎంపీ, మమత మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని