Mulayam Singh Yadav: కొడుకు పేరు మర్చిపోయిన ములాయం.. యోగి సెటైర్లు..!

ఈసారి జరుగుతోన్న ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక నేత ములాయంసింగ్‌ యాదవ్‌ గురువారం కనిపించారు. తన కుమారుడు

Published : 18 Feb 2022 22:24 IST

కర్హాల్‌: ఈసారి జరుగుతోన్న ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక నేత ములాయంసింగ్‌ యాదవ్‌ గురువారం కనిపించారు. తన కుమారుడు, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌ పోటీ చేస్తోన్న కర్హాల్‌ నియోజకవర్గ ఎన్నికల ర్యాలీలో ములాయం పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. సభలో మాట్లాడిన ములాయంకు కొడుకు అఖిలేశ్‌ పేరు గుర్తురాలేదు. పక్కన ఉన్న మరో ఎస్పీ నేత చెప్పడంతో తన కుమారుడిని గెలిపించాలని ములాయం కోరారు. 

నిన్న ఎన్నికల ప్రచారంలో ములాయం ప్రసంగం చివరికి వస్తుండగా పక్కనే ఉన్న ఎంపీ ధర్మేంద్ర యాదవ్‌ ‘ఓట్లు అడగండి’ అని నేతాజీ దగ్గరకు వచ్చి చెప్పారు. ఆ క్షణంలో ములాయం కొంత గందరగోళానికి గురైనట్లు కన్పించారు. కర్హాల్‌ అభ్యర్థి తన కుమారుడే అన్న విషయం గుర్తు రాలేదేమో.. ‘‘ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థిని గెలిపించండి’’ అని ఓటర్లను కోరారు. దీంతో ధర్మేంద్ర యాదవ్‌.. ములాయంకు అఖిలేశ్ పేరు చెప్పగా భారీ మెజార్టీతో అఖిలేశ్‌ను గెలిపించండి అని అభ్యర్థించారు. 

ఇక ప్రత్యర్థులు ఊరుకుంటారా.. ములాయం ప్రసంగంపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్పందిస్తూ.. అఖిలేశ్‌పై వ్యంగ్య బాణాలు విసిరారు. ‘‘నేతాజీ(ములాయంను ఉద్దేశిస్తూ) చాలా తెలివైన వారు. కర్హాల్‌ ప్రజలు భాజపా అభ్యర్థి ఎస్పీ సింగ్ బఘేల్‌ను గెలిపిస్తారని ఆయనకు తెలుసు. కానీ ‘నా పేరు చెప్పండి’’ అంటూ ఆయన(అఖిలేశ్‌ను ఉద్దేశిస్తూ) పదేపదే గుర్తుచేస్తున్నారు. కర్హాల్‌ నుంచి పోటీ చేస్తున్న ఎస్పీ అభ్యర్థి తనకు తెలియదని ములాయం చెప్పారు. తండ్రికే తన కుమారుడి పేరు గుర్తులేకపోవడం దురదృష్టకరం. ఆ పార్టీకి ఎంతటి దుర్గతి పట్టిందో..!’’ అని యోగి ఎద్దేవా చేశారు. 

యావత్‌ దేశాన్ని ఆకర్షిస్తోన్న ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల పోరులో రాజకీయ పార్టీల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నెల 20న అక్కడ మూడో విడత ఓటింగ్‌ జరగనుంది. ఈ దశలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ పోటీ చేస్తోన్న కర్హాల్‌ నియోజకవర్గానికి కూడా పోలింగ్‌ జరగనుంది. అఖిలేశ్‌ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. ఆయనను ఎదుర్కొనేందుకు భాజపా.. కేంద్రమంత్రి ఎస్పీ సింగ్‌ బఘేల్‌ను రంగంలోకి దించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని