
UP Election 2022: సమాజ్వాదీ పార్టీకి ఎదురుదెబ్బ.. భాజపాలోకి ములాయం కోడలు!
లఖ్‌నవూ: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఉత్తరప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార భాజపా నుంచి సమాజ్వాదీ పార్టీలోకి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు చేరుతున్న నేపథ్యంలో ఇందుకు భిన్నంగా మరో వార్త తెగ చక్కర్లు కొడుతోంది. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్నకోడలు భాజపాలో చేరనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ములాయం చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణ యాదవ్ ఈ మేరకు భాజపా తీర్థం పుచ్చుకోనున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే అఖిలేశ్ పార్టీకి కొంతమేర ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.
2017 ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ తరఫున పోటీ చేశారు అపర్ణ యాదవ్. కానీ, భాజపా అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే, ఇటీవలి కాలంలో భాజపా ప్రభుత్వ విధానాలను సమర్థిస్తూ వస్తున్నారు. దీంతో ఆమె కాషాయ కండువా కప్పుకుంటారనే ప్రచారం ఊపందుకుంది. గత కొద్దిరోజులుగా కీలకమైన బీసీ నేతలు పార్టీ నుంచి బయటకు వెళ్లిన నేపథ్యంలో.. అపర్ణ యాదవ్ చేరిక.. భాజపాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అది కూడా.. ఎస్పీకి నాయకత్వం వహిస్తున్న కుటుంబంలోని వ్యక్తి రావడం.. భాజపాకు లాభించనుందని విశ్లేషకులు చెబుతున్నారు.
రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన స్వామి ప్రసాద్ మౌర్య, ధరమ్ సింగ్ సైనీ సహా పలువురు ఎమ్మెల్యేలు తమ అనుచరులతో కలిసి సమాజ్వాదీ పార్టీలో చేరారు. బీసీ ఓట్లతో భాజపా అధికారంలోకి వచ్చిందని, ఇన్నేళ్లయినా ఆ వర్గాన్ని పట్టించుకోలేదని ఈ మేరకు ఆరోపించారు. అనేకమంది అన్యాయానికి గురవుతున్నారని పేర్కొన్నారు.