Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

మునుగోడు ఉప ఎన్నికకు నగారా మోగింది. ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది.

Updated : 03 Oct 2022 12:56 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల నగారా మోగింది. తెలంగాణతో పాటు మరో 5 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. ఈ మేరకు ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది.

తెలంగాణలోని మునుగోడుతో పాటు అంధేరి ఈస్ట్‌ (మహారాష్ట్ర), మోకమా (బిహార్‌), గోపాల్‌గంజ్‌ (బిహార్‌), అదంపూర్‌ (హరియాణా), గోల గోఖర్నాథ్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌) ధామ్‌నగర్‌ (ఒడిశా)లో స్థానాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్‌ 3న పోలింగ్‌ నిర్వహించి నవంబర్‌ 6న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఈసీ వెల్లడించింది. 

ముఖ్యమైన తేదీలు

ఉప ఎన్నికల నోటిఫికేషన్‌- అక్టోబర్‌ 7

నామినేషన్ల స్వీకరణ గడువు -అక్టోబర్‌ 14 

నామినేషన్ల పరిశీలన- అక్టోబర్‌ 15

నామినేషన్ల ఉపసంహరణ గడువు- అక్టోబర్‌ 17

ఎన్నికల పోలింగ్‌ - నవంబర్‌ 3

ఓట్ల లెక్కింపు- నవంబర్‌ 6

మునుగోడులో త్రిముఖ పోరు తప్పదా?

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్‌రెడ్డి.. అనంతరం భాజపాలో చేరారు. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ, దివంగత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతికి అక్కడ అభ్యర్థిగా ప్రకటించి ప్రచార పర్వంలో ముందుకెళ్తోంది. భాజపా తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి దాదాపు టికెట్‌ ఖాయమైంది. అయితే దీనిపై ఆ పార్టీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు అధికార తెరాస తమ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని తెరాస అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతున్నప్పటికీ దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు.  

మునుగోడులో ఎలాగైనా గెలిచి తీరాలని అధికార తెరాసతో పాటు భాజపా, కాంగ్రెస్‌ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా భాజపా ఈ స్థానంపై బాగా ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే కేంద్రహోంమంత్రి అమిత్‌షా అక్కడ సభకు హాజరై శ్రేణుల్లో జోష్‌ తీసుకొచ్చారు. రాష్ట్రస్థాయి నేతలు ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులపై సమీక్షిస్తూ ముందుకెళ్తున్నారు. మరోవైపు తెరాస అధినేత కేసీఆర్‌ కూడా ‘ప్రజా దీవెన’ పేరిట ఇప్పటికే భారీ బహిరంగ సభ నిర్వహించి శ్రేణులను ఉప ఎన్నికకు సమాయత్తం చేశారు. అటు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రస్థాయి నేతలు సైతం మునుగోడులోనే మకాం వేసేందుకు సిద్ధమవుతున్నారు. 2019 ఎన్నికల్లో గెలిచిన స్థానం కావడంతో ఎలాగైనా మునుగోడులో పట్టు నిలుపుకోవాలని ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. తెరాస, భాజపా, కాంగ్రెస్‌ పార్టీలూ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తుండటంతో ‘మునుగోడు’ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని