Munugode bypoll: కేసీఆర్‌ పతనం మునుగోడు నుంచే మొదలైంది: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

కేసీఆర్‌ వివక్షకు వ్యతిరేకంగా యుద్దం చేస్తున్నా.. అరాచక పాలనను అంతమొందించాల్సిన సమయం ఆసన్నమైందని మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే  

Published : 22 Aug 2022 02:04 IST

మునుగోడు: కేసీఆర్‌ వివక్షకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నా.. అరాచక పాలనను అంతమొందించాల్సిన సమయం ఆసన్నమైందని మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మునుగోడులో ఏర్పాటు చేసిన భాజపా సమరభేరి సభలో రాజగోపాల్‌రెడ్డికి.. హోం మంత్రి అమిత్‌ షా కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ... ‘‘అమ్ముడు పోయానుంటున్నారు. నన్ను కొనే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. రాజీనామా చేసి నిజాయితీగా ప్రజల తీర్పు కోరుతున్నా. మునుగోడు ప్రజలు తలదించుకునే పని ఎప్పటికీ చేయను. నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించినా న్యాయం జరగలేదు. ఎన్నిసార్లు అపాయింట్‌మెంట్‌ అడిగినా సీఎం ఇవ్వలేదు. ముందుగానే ఇక్కడి ప్రజలకు చెప్పా.. నేను రాజీనామా చేస్తే ఫామ్‌ హౌస్‌లో పడుకున్న కేసీఆర్ నిద్రలేచి మునుగోడు వస్తారని. అలాగే నిన్న కేసీఆర్‌ మునుగోడు వచ్చారు. నా రాజీనామాతో గట్టుప్పల్‌ మండలం వచ్చింది. కొత్త పింఛన్లు వచ్చాయి. తెలంగాణ ప్రజలు ఆకలినైనా చంపుకొంటారు కానీ, ఆత్మగౌరవాన్ని వదులుకోరు. 

తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేసీఆర్‌ కాళ్ల దగ్గర పెడుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఒక వ్యక్తి కోసం, ఒక పార్టీ కోసం వచ్చింది కాదు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఆత్మగౌరవం కోసం వచ్చిన ఎన్నిక. తెలంగాణ భవిష్యత్తు నిర్మాణం చేయాలంటే మునుగోడు ప్రజలు చారిత్రక తీర్పు ఇవ్వాలి. కేసీఆర్‌ కుటుంబానికి, మునుగోడు ప్రజలకు జరుగుతున్న ధర్మయుద్ధమిది. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్‌ దోచుకున్న సొమ్మంతా కక్కిస్తాం. భాజపా వస్తే మోటార్లకు మీటర్లు పెడతారని కేసీఆర్‌ చెబుతున్నారు. దుబ్బాకలో, హుజూరాబాద్‌లో భాజపా గెలిచింది. అక్కడ మోటార్లకు మీటర్లు పెట్టారా? మునుగోడులో ధర్మం గెలుస్తుంది. కేసీఆర్‌ పతనం మునుగోడు నుంచి ఈరోజు అమిత్‌ షా చేతుల మీదుగా ప్రారంభమైంది’’ అని రాజగోపాల్‌ రెడ్డి అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు