Muralidhar Rao: తెరాసలో భూకంపం రాబోతోంది: మురళీధర్‌రావు

విదేశీ మారక ద్రవ్యం నిల్వలు తగ్గిపోతున్నా.. దేశం ఆర్థిక సంక్షోభం వైపు వెళ్లడం లేదని భాజపా సీనియర్‌ నేత, ఆ పార్టీ మధ్యప్రదేశ్‌ వ్యవహారాల

Published : 08 Aug 2022 14:58 IST

హైదరాబాద్‌: విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతున్నా.. దేశం ఆర్థిక సంక్షోభం వైపు వెళ్లడం లేదని భాజపా సీనియర్‌ నేత, ఆ పార్టీ మధ్యప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మురళీధర్‌రావు అన్నారు. ద్రవ్యోల్బణం ప్రమాదం అంచున దేశం లేదన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ, డాలర్‌తో రూపాయి పతనం తదితర అంశాలపై సీఎం కేసీఆర్‌తో చర్చకు సిద్ధమని ఆయన సవాల్‌ విసిరారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మురళీధర్‌రావు మాట్లాడారు. 

వారికి ఆర్థికశాస్త్రం తెలియదు..

‘‘నీతి ఆయోగ్‌ నిరర్ధకమని చెప్పి సమావేశాన్ని కేసీఆర్‌ బహిష్కరించారు. భాజపాయేతర ముఖ్యమంత్రులెవరూ అలా చేయలేదు. ఆ సమావేశంలో క్రాప్‌ డైవర్షన్‌, జీఎస్టీ ట్యాక్స్‌లు కొన్నింటిపై తీసేయాలనే అంశాలతో పాటు ధరల పెరుగుదల పైనా చర్చించారు. కేసీఆర్‌, కేటీఆర్‌కు ఆర్థికశాస్త్రం తెలియదు. బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎల్‌ఐసీ అమ్ముతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 8 ఏళ్లలో బ్యాంకులకు చెల్లించాల్సిన మొండి బకాయిలను కేంద్ర ప్రభుత్వం వసూలు చేసింది. ఉచిత పథకాలపై ఒక్క రాష్ట్రాన్ని ఉద్దేశించి మాట్లాడింది కాదు. కార్పొరేట్‌ రుణాలు ఎక్కడా మాఫీ చేయలేదు. 

ప్రాజెక్టును సర్టిఫైడ్‌ చేస్తే.. అవినీతి సర్టిఫైడ్‌ చేసినట్లా?

తెరాస ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్ర ప్రభుత్వం Vs రాష్ట్ర ప్రభుత్వం అని చూపేందుకు తప్పుడు రాజకీయ ప్రచారం చేస్తూ యుద్ధం ప్రారంభిస్తున్నారు. ఈ యుద్ధంలో కేసీఆర్‌కు ఓటమి తథ్యం. కాళేశ్వరం ప్రాజెక్టును సర్టిఫైడ్ చేస్తే.. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని సర్టిఫైడ్‌ చేసినట్లా? ఆ అవినీతి బయటకు వస్తుందనే కేంద్రంపై కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తెరాసలో భూకంపం రాబోతోంది. ఆ పార్టీలో అసమ్మతి బాంబు త్వరలో బ్లాస్ట్‌ అవుతుంది. కేసీఆర్‌ తాటాకు చప్పుళ్లకు భయపడే పరిస్థితి లేదు. సిద్దిపేట నియోజకవర్గంలో ‘ప్రజా గోస.. భాజపా భరోసా’ కార్యక్రమంలో పాల్గొన్నా. సిద్దిపేట ప్రజలు కుతకుతగా ఉన్నారు. ఎన్నికల వాగ్దానాలు నెరవేరలేదు. సిద్దిపేట నియోజకవర్గంలో తెరాస ఓటమి ఖాయం’’ అని మురళీధర్‌రావు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని