Maharashtra crisis: అధికారం ఉన్నా.. లేకపోయినా మేం ఠాక్రే వెంటే..: చవాన్‌

మహారాష్ట్రలోని శివసేనలో తీవ్ర అంతర్గత సంక్షోభం నెలకొన్న వేళ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం పృథ్వీరాజ్‌ చవాన్‌ (Prithviraj Chavan) కీలక వ్యాఖ్యలు చేశారు. ......

Published : 28 Jun 2022 02:05 IST

దిల్లీ: మహారాష్ట్రలోని శివసేనలో తీవ్ర అంతర్గత సంక్షోభం నెలకొన్న వేళ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం పృథ్వీరాజ్‌ చవాన్‌ (Prithviraj Chavan) కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఈ కష్ట సమయంలో ఉద్ధవ్‌ ఠాక్రే వెన్నంటే ఉంటామని స్పష్టంచేశారు. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్‌ సారథ్యంలో ఏర్పాటైన మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఐక్యంగానే నిలబడుతుందని వ్యాఖ్యానించారు. సోమవారం విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలో నెలకొన్న ఈ రాజకీయ సంక్షోభానికి భాజపానే కారణమని చవాన్‌ ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తోందని మండిపడ్డారు. శివసేన రెబల్‌ ఎమ్మెల్యేల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నందున దీనిపై తదుపరి వ్యాఖ్యలు చేసేందుకు ఆయన నిరాకరించారు. మరోవైపు, శివసేన రెబల్ ఎమ్మెల్యేలు తమ వైఖరి మార్చుకొని గువాహటి నుంచి ముంబయికి తిరిగి వస్తారంటూ ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ విశ్వాసం వ్యక్తంచేసిన మరుసటి రోజే పృథ్వీరాజ్‌ చవాన్‌ ఇలా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని