Sivasena: ‘నా కొడుకు నా వారసుడు కాదు’..ఠాక్రేకు సీఎం శిందే కౌంటర్‌

దసరా ర్యాలీ ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందే ఠాక్రేక్‌కు ట్విటర్‌ వేదికగా సీఎం శిందే కౌంటర్‌ ఇచ్చారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రే వారసత్వం పార్టీకి తప్పని సరిగా ఉండాల్సిన అవసరం లేదని చెప్తూ ప్రముఖ కవి హరివాన్ష్‌ రాయ్‌ బచ్చన్‌ చెప్పిన మాటలను ట్విటర్‌లో ఉటంకించారు.

Published : 06 Oct 2022 01:40 IST

ముంబయి: గడిచిన 56 ఏళ్లలో తొలిసారిగా శివసేన రెండు దసరా ర్యాలీలను నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే వర్గం బాంద్రా కుర్లాలోని ఎంఎంఆర్డీయే మైదానం నుంచి ర్యాలీని ప్రారంభిస్తుండగా.. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం శివాజీ మైదానం నుంచి ప్రారంభించనున్నారు. అయితే, ర్యాలీ ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందే ఠాక్రేకు ట్విటర్‌ వేదికగా శిందే కౌంటర్‌ ఇచ్చారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రే వారసత్వం పార్టీకి తప్పని సరిగా ఉండాల్సిన అవసరం లేదని చెప్తూ ప్రముఖ కవి హరివంశ్‌ రాయ్‌ బచ్చన్‌ చెప్పిన మాటలను ఉటంకించారు. ‘‘ కొడుకు అయినంత మాత్రాన నా కొడుకు నా వారసుడు కాదు. ఎవరు వారసుడైతే వాడే నా కొడుకు’’ అంటూ రాయ్‌ మాటలను శిందే ట్విటర్‌లో రాసుకొచ్చారు. తద్వారా పార్టీ ఉద్ధవ్‌ ఠాక్రేకే సొంతమని చెప్పడం సమంజసం కాదని చెప్పకనే చెప్పారు.

దసరా ర్యాలీలను శివసేనలోని రెండు వర్గాలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. తమ బలాన్ని నిరూపించుకునేందుకు వీటిని వేదికలుగా మార్చుకున్నాయి.  పార్టీపై తిరుగుబావుటా ఎగరేసి భాజపా మద్దతుతో ఏక్‌నాథ్‌ శిందే జులై 1న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, తండ్రి బాల్‌ ఠాక్రే స్థాపించిన శివసేనను తన అధీనంలో ఉంచుకునేందుకు ఉద్ధవ్‌ ఠాక్రే ప్రయత్నిస్తుండగా.. మాదే అసలైన శివసేన అంటూ శిందే వర్గం చెబుతోంది. ర్యాలీల నిర్వహణలోనూ రెండు వర్గాలు కోర్టు మెట్లెకారు. అయితే ఉద్ధవ్‌ ఠాక్రేకు అనుకూలంగా తీర్పురావడంతో శివాజీ పార్కు నుంచి ఆయన ర్యాలీ నిర్వహిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని