Andhra News: జోగి రమేష్ X వసంత కృష్ణ ప్రసాద్‌.. జగన్‌ వద్దకు చేరిన మైలవరం పంచాయతీ

ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్‌, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ మధ్య కొంత కాలంగా నెలకొన్న వర్గపోరు తార స్థాయికి చేరింది.

Published : 09 Feb 2023 20:54 IST

అమరావతి: ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం నియోజకవర్గంలో వైకాపా నేతల మధ్య నెలకొన్న పంచాయతీ మరోసారి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరింది. మంత్రి జోగి రమేష్‌, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ మధ్య కొంత కాలంగా నెలకొన్న వర్గపోరు తారస్థాయికి చేరింది. పరస్పరం తీవ్ర ఆరోపణలు, విమర్శలతో ఇరు వర్గాలు రచ్చకెక్కాయి. మంత్రి జోగి రమేష్‌ అనుచరుడు నల్లమోతు మధుబాబుపై ఎమ్మెల్యే వసంత అనుచరులు పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు పెట్టగా.. ప్రతిగా జోగి రమేష్‌ వర్గీయులూ ఫిర్యాదులు చేశారు.

మంత్రి, ఎమ్మెల్యే వర్గాలతో నిన్న రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ మర్రి రాజశేఖర్‌ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన సీఎం జగన్‌ నిన్న జోగి రమేష్‌ను, ఇవాళ వసంత కృష్ణ ప్రసాద్‌ను పిలిపించుకుని మాట్లాడారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్‌ వర్గీయుల వ్యవహార శైలిపై సీఎంకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. వారి సంగతి వదిలేసి వెంటనే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం సూచించినట్టు సమాచారం. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆదేశాలనే పాటించేలా చర్యలు తీసుకోవాలని సీఎంవో అధికారులకు ముఖ్యమంత్రి సూచించినట్టు తెలిసింది. త్వరలోనే గడప గడపకు కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని సీఎంకు ఎమ్మెల్యే చెప్పినట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని