Manipur: బీరేన్‌సింగ్‌కే మళ్లీ అవకాశం.. మణిపుర్‌ సీఎంను ప్రకటించిన భాజపా

ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్‌ ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ఎన్‌ బీరేన్‌ సింగ్‌ మరోసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టనున్నారు. ఈ పోస్టుకు మరో ఇద్దరి పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ బీరేన్‌ వైపే భాజపా అధిష్ఠానం మొగ్గు చూపింది.

Published : 20 Mar 2022 18:25 IST

ఇంఫాల్‌: ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్‌ ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ఎన్‌ బీరేన్‌ సింగ్‌ మరోసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టనున్నారు. ఈ పోస్టుకు మరో ఇద్దరి పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ బీరేన్‌ వైపే భాజపా అధిష్ఠానం మొగ్గు చూపింది. దీంతో బీరేన్‌ సింగ్‌ వరుసగా రెండోసారి మణిపుర్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాలకు గానూ 32 స్థానాల్లో భాజపా గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే, సీఎం పీఠం విషయంలో బీరేన్‌ సింగ్‌కు, బిశ్వజిత్‌ సింగ్‌కు మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వీరితో పాటు మాజీ స్పీకర్‌, ఆరెస్సెస్‌కు చెందిన యుమ్‌నమ్‌ కెమ్చెంద్‌ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్‌, కిరన్‌ రిజిజు ఆదివారం ఇంఫాల్‌ వెళ్లారు. పార్టీ నేతలతో చర్చల అనంతరం సీఎంను ప్రకటించారు.

జర్నలిస్టు నుంచి సీఎం వరకు..

ఎన్‌.బీరేన్‌సింగ్‌.. జర్నలిస్టుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించి, ఆ తర్వాత రాజకీయాల్లో చేరి అంచలంచెలుగా ఎదిగారు. 1992లో ‘నహరోల్జి తౌడాంగ్‌’ అనే వార్తా పత్రికను ప్రారంభించి 2001 వరకు ఎడిటర్‌గా పనిచేశారు. ఆ గుర్తింపుతోనే 2002లో క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలుత డెమొక్రటిక్‌ రెవల్యూషనరీ పీపుల్స్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే ఏడాది కాంగ్రెస్‌లోకి వెళ్లి అప్పటి ముఖ్యమంత్రి ఓక్రమ్‌ ఇబోబి సింగ్‌ మంత్రివర్గంలో సభ్యుడయ్యారు. స్వల్పకాలంలోనే ఇబోబి సింగ్‌కు అత్యంత సన్నిహితుడిగా మారారు. 2002 నుంచి 2016 వరకు కాంగ్రెస్‌ హయాంలో పలు కీలక మంత్రిత్వ శాఖల బాధ్యతలు చూశారు. 2016లో కాంగ్రెస్‌తో విభేదించి భాజపాలో చేరారు. 2017 ఎన్నికల్లో ఎన్‌పీపీ, ఎన్‌పీఎఫ్‌, ఎల్‌జేపీల భాగస్వామ్యంతో భాజపాను అధికారంలోకి తీసుకొచ్చి తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2020లో పార్టీలో ఆయనపై వ్యతిరేకత బహిర్గతమైనప్పటికీ రాజకీయ చతురతతో సద్దుమణిగేలా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని