Gujarat polls: భాజపా ప్రచార వ్యూహం.. ఒకేరోజు 89 ర్యాలీల్లో హేమాహేమీలతో క్యాంపెయిన్‌!

గుజరాత్‌(Gujarat polls)లో ఈసారి కూడా గెలుపు తమదేనన్న ధీమాతో ఉన్న కమలనాథులు ఈ ఎన్నికల్లో మరింత కసిగా పనిచేస్తున్నారు. గతంలో కన్నా అధికంగా సీట్లు, ఓట్లు సాధించి రికార్డులన్నింటినీ బ్రేక్‌ చేయాలన్న పట్టుదలతో పనిచేస్తున్నారు.

Published : 18 Nov 2022 01:44 IST

దిల్లీ: గుజరాత్‌(Gujarat polls)లో ఈసారి కూడా గెలుపు తమదేనన్న ధీమాతో ఉన్న కమలనాథులు ఈ ఎన్నికల్లో మరింత కసిగా పనిచేస్తున్నారు. గతంలో కన్నా అధికంగా సీట్లు, ఓట్లు సాధించి రికార్డులన్నింటినీ బ్రేక్‌ చేయాలన్న పట్టుదలతో పనిచేస్తున్నారు. ఇందుకోసం అభ్యర్థులను ఎంపిక చేయడం మొదలుకొని ప్రచారం దాకా పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. మోదీ, అమిత్‌ షాల స్వరాష్ట్రంలో ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుసగా ఏడోసారి కూడా తామే అధికారంలోకి రావాలన్న సంకల్పంతో సర్వశక్తుల్నీ ధారపోస్తున్నారు. డిసెంబర్‌ 1న తొలివిడత పోలింగ్‌ జరగనుండగా.. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా వంటి దిగ్గజ నేతలు ప్రచారం నిర్వహించారు. అయితే, తాజాగా ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేయాలని భావించిన భాజపా.. హేమాహేమీ నేతలను ప్రచారంలోకి దించాలని నిర్ణయించినట్టు సమాచారం.

తొలి విడతలో ఎన్నికలు జరిగే 89 నియోజకవర్గాల్లో శుక్రవారం ఒక్కరోజే వరుస సభలతో ప్రచారాన్ని హోరెత్తించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, సీఎంలు గుజరాత్‌లో సుడిగాలి పర్యటనలతో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. జేపీ నడ్డా నవసరి, రాజ్‌కోట్‌ తూర్పు, అంక్లేశ్వర్‌లలో ప్రచారంలో పాల్గొననుండగా... కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ (మూడు) నరేంద్రసింగ్‌ తోమర్‌ (నాలుగు) అనురాగ్‌ ఠాకూర్‌ (నాలుగు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ (మూడు),  మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నాలుగు చోట్ల బహిరంగ ర్యాలీల్లో పాల్గొననున్నారు. అలాగే, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌, కేంద్రమంత్రులు వీకే సింగ్‌, ఫగన్‌ సింగ్ కులస్థే తదితర నేతలు పలు ర్యాలీల్లో పాల్గొని ప్రచారం చేయనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

గుజరాత్‌లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత పోలింగ్‌ డిసెంబర్‌ 1న, రెండో విడత పోలింగ్‌ డిసెంబర్‌ 5న నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, 1995 నుంచి నిరాటంకంగా అధికారంలో కొనసాగుతున్న భాజపా ఈసారి కూడా గుజరాత్‌ పీఠాన్ని పదిలం చేసుకొనేందుకు ప్రయత్నిస్తుండగా.. గత వైభవం కోసం కాంగ్రెస్‌ కూడా గట్టిగానే పోరాడుతోంది. ఇంకోవైపు, పంజాబ్‌లో గెలుపుతో ఉత్సాహంలో ఉన్న ఆప్‌ తమకు ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలంటూ ఓటర్లలోకి దూసుకెళ్తుండటంతో ఈసారి గుజరాత్‌లో త్రిముఖ పోటీ నెలకొనడంతో గుజరాత్‌లో ఎన్నికలు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని