Janasena: క్రాప్ హాలీడే కాదు.. వైకాపా సర్కార్‌కే హాలీడే ప్రకటించాలి: నాదెండ్ల

వైకాపా మంత్రులు జాతి రత్నాల్లా వ్యవహరిస్తున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ‘వారాహి’ ప్రచార రథంపై విమర్శలు చేస్తున్న మంత్రులకు మాండౌస్ తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులు మాత్రం గుర్తుకు రావడం లేదని ఎద్దేవా చేశారు.

Published : 15 Dec 2022 02:12 IST

ఏలూరు: రైతు భరోసా కేంద్రాలు.. వైకాపా కార్యాలయాలుగా మారాయని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో బుధవారం ఆయన పర్యటించారు. పొలం పనులు చేస్తూ ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన పార్టీ క్రియాశీల కార్యకర్త శ్రీమన్నారాయణ కుటుంబాన్ని పరామర్శించారు. నారాయణపురంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద కార్యకర్త శ్రీమన్నారాయణ చిత్రపటానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు బీమా పరిహారం చెక్కును అందజేశారు. పార్టీ వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

వైకాపా మంత్రులు జాతి రత్నాల్లా వ్యవహరిస్తున్నారని నాదెండ్ల విమర్శించారు. ‘వారాహి’ ప్రచార రథంపై విమర్శలు చేస్తున్న మంత్రులకు మాండౌస్ తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులు మాత్రం గుర్తుకు రావడం లేదని ఎద్దేవా చేశారు. వైకాపా ప్రభుత్వ వైఖరి కారణంగా ఆక్వా రైతులు ఏకంగా పంట విరామ స్థితికి చేరుకున్నారని.. రానున్న రోజుల్లో వైకాపా ప్రభుత్వానికి విరామం ప్రకటించేలా జనసైనికులు పోరాట పటిమ ప్రదర్శించాలని మనోహర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు మండలాలకు చెందిన వైకాపా నేతలు నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు.

వైకాపా ప్రభుత్వానికే హాలీడే ప్రకటించాలి..

అనంతరం మంగళగిరి పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గత మూడేళ్లలో రాష్ట్రంలో అధికారికంగా 1,673 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు స్వరాజ్య వేదిక సర్వే ప్రకారం 3వేల మందికి పైగా రైతులు ఆత్యహత్య చేసుకున్నట్లు తేలింది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు జనసేన నుంచి రూ.లక్ష సాయం అందజేశాం. ఇప్పటివరకు 7జిల్లాల్లో కౌలురైతు భరోసా యాత్ర పూర్తి చేశాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఈనెల 18న కౌలురైతు భరోసా యాత్ర చేపడతాం. రైతులు క్రాప్‌ హాలీడే కాకుండా.. వైకాపా ప్రభుత్వానికే హాలీడే ప్రకటించాలి. కడపలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మించే జేఎస్‌డబ్ల్యూ కంపెనీకి రూ.5వేల కోట్ల లబ్ధి చేకూర్చారు’’ అని నాదెండ్ల మనోహర్‌ అన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని