Andhra News: ఆత్మగౌరవంతో ఉన్న వారంతా వైకాపా నుంచి బయటకు రావాలి: నాదెండ్ల మనోహర్‌

అహంభావానికి, ఆత్మగౌరవానికి జరిగే పోరాటంలో చివరికి గెలిచేది ఆత్మగౌరవమేనని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. సీఎం జగన్ అధికారాన్ని అడ్డంపెట్టుకొని అహంకారంతో సినిమా థియేటర్ల వద్ద కర్ఫ్యూ వాతావరణాన్ని తీసుకొచ్చారని విమర్శించారు...

Updated : 27 Feb 2022 06:38 IST

విజయవాడ: అహంభావానికి, ఆత్మగౌరవానికి జరిగే పోరాటంలో చివరికి గెలిచేది ఆత్మగౌరవమేనని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. సీఎం జగన్ అధికారాన్ని అడ్డంపెట్టుకొని అహంకారంతో సినిమా థియేటర్ల వద్ద కర్ఫ్యూ వాతావరణాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. ప్రజా సమస్యలు తీరుస్తారని నమ్మి అధికారం ఇస్తే... జగన్ ఇలాంటి పాలన అందిస్తారని ఎవరూ ఊహించి ఉండరని వ్యాఖ్యానించారు. భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద జరిగిన సంఘటనలు చూసి యావత్‌ ప్రపంచం ఆశ్చర్యపోయిందన్నారు. ఎవరూ ఊహించని విధంగా క్షేత్రస్థాయిలో అధికార దుర్వినియోగం జరిగిందని నాదెండ్ల ఆరోపించారు.

‘‘సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తామని, పెట్టుబడులు పెడితే ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని గతంలో సీఎం చెప్పారు. పవన్ కల్యాణ్ సినిమా విడుదల సందర్భంగా ప్రతి సినిమా థియేటర్ వద్ద ప్రభుత్వ సిబ్బందిని ఉపయోగించి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా కుట్ర చేయడం సిగ్గుచేటు. ప్రజలకు ఉపయోగపడాల్సిన రెవెన్యూ సిబ్బంది బాధ్యతలను పక్కన పెట్టించి వేకువజామునే వీళ్లందరినీ సినిమా థియేటర్ల వద్దకు పంపించారు. కక్షపూరితంగా, నియంతలా వ్యవహరిస్తూ.. తన ఆలోచన మేరకే ప్రతి ఒక్కరూ పనిచేయాలనే భావనతో ఉన్న సీఎంని పక్కన పెట్టే సమయం వచ్చింది. ప్రజాస్వామ్యాన్ని నమ్మే వైకాపా నాయకులకు, కార్యకర్తలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. సమయం వచ్చింది.. ఆత్మగౌరవంతో ఉన్న వారంతా వైకాపా నుంచి బయటకు రావాలి. మాతో కలిసి ముందుకు నడవండి. పవన్‌కల్యాణ్‌ నాయకత్వంలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికీ చూపిద్దాం’’ అని నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. భీమ్లానాయక్ చిత్రం విడుదల సమయంలో ప్రభుత్వం నుంచి ఎన్నో ఒత్తిళ్లు, అవమానాలు ఎదురైనా పవన్‌ అభిమానులు హుందాగా ప్రవర్తించారని.. ఈ సందర్భంగా జనసైనికులను మనోహర్‌ అభినందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని