Naga babu: రాజకీయాల్లో విమర్శలు ఉండాలే తప్ప తిట్లు ఉండకూడదు!

రాజకీయాల్లో విమర్శలు ఉండాలి తప్ప.. వ్యక్తిగత దూషణలు ఉండకూడదని, సినీ నటుడు, జనసేన నేత నాగబాబు అన్నారు.

Published : 21 Nov 2021 01:12 IST

హైదరాబాద్‌: రాజకీయాల్లో విమర్శలు ఉండాలి తప్ప.. వ్యక్తిగత దూషణలు ఉండకూడదని, సినీ నటుడు, జనసేన నేత నాగబాబు అన్నారు. ఏపీ అసెంబ్లీలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరిపై కొందరు నాయకులు వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని నాగబాబు ఖండించారు. ఇలాంటి చెత్త సంప్రదాయానికి ఇకనైనా ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఓ వీడియోను సోషల్‌మీడియాలో పంచుకున్నారు.

‘‘అందరికీ నమస్కారం.. మీడియా ముందుకు వచ్చి చాలా రోజులైంది. నేను పవన్‌కల్యాణ్‌ నాయకత్వంలో పనిచేస్తున్న జన సైనికుడిని మాత్రమే. తెదేపా, వైకాపాలను ప్రత్యర్థి పార్టీలుగానే చూస్తాం. శత్రువులుగా చూడం. పనితీరు విషయంలో లోపాలు ఉంటే గట్టిగా విమర్శిస్తాం. ఇటీవల కాలంలో ఒక చెడు సంప్రదాయం మొదలైంది. అసెంబ్లీలో ఉండాల్సిన హుందాతనం పోయింది. అది కేవలం వైకాపా వాళ్లతోనే మొదలైందని నేను అనను. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత దీనికి నాంది పడింది. ఈ మధ్య కాలంలో ఒకరిద్దరు వ్యక్తులు సీఎం జగన్‌ను ఉద్దేశంతో అసభ్య పదజాలంతో దూషించారు. ఇదే విషయమై ఒక సమావేశంలో జగన్‌ బాధపడ్డారు. అప్పుడు కూడా అది సరైన పద్ధతి కాదనిపించింది’’

‘‘వ్యక్తిగతంగా దూషించడం అసహ్యకరమైన పని. ఇప్పుడు చంద్రబాబునాయుడిగారి సతీమణిపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఆమెకు కుటుంబ వ్యవహారాలు, బిజినెస్‌ తప్ప రాజకీయాలతో సంబంధం లేదు. మీరు చంద్రబాబును, లోకేశ్‌ను ఎన్ని రకాలుగా విమర్శించినా తప్పులేదు. అంతేకానీ వ్యక్తిగతం దూషణలు చేయొద్దు. అలాగే తెదేపా వాళ్లు సీఎం జగన్‌ను వ్యక్తిగతంగా తిట్టొద్దు. ఆయన పరిపాలనను విమర్శించండి. రాజకీయాల్లో విమర్శలు ఉండాలే తప్ప తిట్లు ఉండకూడదు. ఈ చెత్త సంప్రదాయం రావటం మా కర్మ. ముఖ్యంగా మహిళలపై వ్యక్తిగత విమర్శలు చేయటం తగదు. ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబునాయుడు. ఆయన ముఖంలో ఎమోషన్స్‌ను చాలా కంట్రోల్‌ చేసుకుంటారు. కానీ, తొలిసారి అందరి ముందూ కన్నీటి పర్యంతమవటం నాకు చాలా బాధనిపించింది. కుటుంబ సభ్యులను విమర్శిస్తే ఎంత బాధాకరంగా ఉంటుందో మాకు తెలుసు. చంద్రబాబునాయుడు వయసులో పెద్ద వ్యక్తి. ఆయనతో కన్నీళ్లు పెట్టించొద్దు. రాజకీయాల్లో ఉన్న ఎవరినైనా విమర్శించవచ్చు. అయితే అవి వ్యక్తిగతంగా చేయకూడదు. కల్యాణ్‌బాబు ఎప్పుడూ వ్యక్తిగత దూషణలకు వెళ్లలేదు. ఇకకైనా ఈ సంప్రదాయానికి ముగింపు పలకండి’’ అని నాగబాబు పేర్కొన్నారు.

Read latest Political News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని