Temjen Imna: ‘ఓడి గెలిచే వారినే.. ఇలా అంటారు’ : ఎన్నికల ఫలితంపై తెమ్జెన్‌

నాగాలాండ్‌లో (Nagaland) భాజపా కూటమి రెండోసారి విజయం సాధించింది. ఈ క్రమంలో ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు, మంత్రిగా ఉన్న తెమ్జెన్‌ ఇమ్నా (Temjen Imna Along) చేసిన ట్వీట్‌ అందర్నీ ఆకర్షించింది.

Published : 01 Apr 2023 17:35 IST

కొహిమా: ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌ (Nagaland) అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా-ఎన్‌డీపీపీ కూటమి మెజార్టీ సాధించి రెండోసారి ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంది. ఈ తరుణంలో ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు, సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తెమ్జెన్‌ ఇమ్నా అలోంగ్‌ (Temjen Imna Along) ఫలితం మీదే అందరి దృష్టి పడింది. ఓట్ల లెక్కింపు మొదలైన సమయంలో ఆయన వెనుకంజలో నిలవడం ఆ పార్టీని కలవరపరిచింది. తరువాతి రౌండ్లలో పుంజుకోవడంతోపాటు చివరకు విజయం సాధించడంతో ఊపిరిపీల్చుకుంది. ఫలితాలు వెల్లడయ్యే ఉత్కంఠ సమయంలోనూ ఈ సోషల్‌ మీడియా స్టార్‌ హాస్యంగా స్పందించిన తీరు అందర్నీ ఆకర్షించింది.

నాగాలాండ్‌లోని ఎలోంగ్‌టాకి నియోజకవర్గం నుంచి 2018లో పోటీ చేసిన తెమ్జెన్‌.. కేవలం 80కిపైగా ఓట్లతో విజయం సాధించారు. అలా మొదటిసారి గెలవడంతోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉన్నతవిద్య, గిరిజన వ్యవహారాల శాఖ బాధ్యతలు చూస్తోన్న ఆయన.. తాజా ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి పోటీ చేశారు. అయితే, మార్చి 2న జరిగిన ఓట్ల లెక్కింపు మొదలైన వెంటనే తెమ్జెన్‌ వెనుకంజలో కొనసాగడం కనిపించింది. దీనిపై స్పందిస్తూ.. ‘ఓడి గెలిచే వారిని.. ఇలా అంటారు’ అంటూ షారుఖ్‌ ఖాన్‌ నటించిన ‘బాజీగర్‌’ సినిమా డైలాగ్‌ను ట్వీట్‌చేశారు. అలా తర్వాతి రౌండ్లలో పుంజుకున్న ఆయన.. తన ప్రత్యర్థిపై సుమారు 4వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

తన వ్యక్తిగత విషయాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రకృతి అందాలను తనదైన శైలిలో వివరించే తెమ్జెన్‌ ఇమ్నా అలోంగ్‌ (Temjen Imna Along) సోషల్‌ మీడియాలో స్టార్‌గా మారారు. ఇటీవల ఆయనపై ప్రధాని మోదీ (Modi) కూడా ప్రశంసలు కురిపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగాలాండ్‌లో పర్యటించిన మోదీ.. ‘మన రాష్ట్ర భాజపా అధ్యక్షుడు చెప్పిన విషయాలు దేశమంతా వినిపిస్తున్నాయి. వాటిని ఎంతో ఎంజాయ్‌ చేస్తున్నారు. ఆయన డిజిటల్ వేదికగా నాగాలాండ్‌, ఈశాన్య భారతాన్ని అందంగా పరిచయం చేస్తున్నారు. నేను ఆయన పెట్టిన ప్రతి పోస్టును చూసేందుకు ప్రయత్నిస్తుంటాను’ అని ప్రశంసలు గుప్పించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని