Andhra News: తాడేపల్లికి చేరిన నగరి వర్గపోరు.. జగన్‌కు ఫిర్యాదు చేసిన మంత్రి రోజా

నగరి నియోజకవర్గ వైకాపా పంచాయితీ తాడేపల్లికి చేరింది. తాజా పరిణామాలపై మంత్రి ఆర్కే రోజా సీఎం జగన్‌ను కలిసి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Published : 27 Oct 2022 01:48 IST

అమరావతి: చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వర్గ పోరు తారస్థాయికి చేరింది. మంత్రి ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజవర్గంలో నేతలు రెండు వర్గాలుగా విడిపోయి పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో నగరి పంచాయితీ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరింది. నియోజకవర్గంలో ఇటీవల జరిగిన పరిణామాలపై మంత్రి రోజా.. సీఎం జగన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రత్యర్థి వర్గం వ్యవహారంపై రోజా తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తనను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని గతంలోనే పలుమార్లు ఆరోపించిన రోజా.. చక్రపాణిరెడ్డి, అసమ్మతి వర్గం తీరుపై సీఎంకు ఫిర్యాదు చేశారు. 

నగరిలో ఏం జరుగుతోందంటే?

ఎన్నికల తర్వాత నియోజకవర్గంలోని శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, వడమాలపేట జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్‌రెడ్డి, రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ కేజే శాంతి, నగరి మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ కేజే కుమార్‌, పుత్తూరుకు చెందిన ఏలుమలై, విజయపురానికి చెందిన లక్ష్మీపతిరాజును మంత్రి ఆర్కే రోజా దూరం పెట్టారు. వారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గీయులుగా ముద్రపడ్డారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో వైకాపా తరఫున కార్యక్రమాలను రెండు వర్గాలు విడిగా చేస్తున్నారు. కొందరు నాయకులు పెద్దిరెడ్డి అండతో పదవులు పొందడం ఈ విభేదాలకు మరింత ఆజ్యం పోసింది. గతేడాది సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా పుత్తూరులో రోజా వ్యతిరేక వర్గం కట్టిన ఫ్లెక్సీల చించివేత చర్చనీయాంశమైంది. 

ఇటీవల నిండ్ర మండలం కొప్పేడులో మంత్రి రోజాతో సంబంధం లేకుండా ఆమె వ్యతిరేకవర్గం నాయకులు ఆర్బీకే, వెల్‌నెస్‌ కేంద్రానికి భూమిపూజ చేశారు. దీనిపై ఆవేదన చెందుతూ రోజా సోమవారం పార్టీ నాయకులకు విడుదల చేసిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘మంత్రిగా ప్రాతినిధ్యం వహించే నా నియోజకవర్గంలో పార్టీని బలహీనపరిచి, తెదేపా, జనసేన నాయకులు నవ్వుకునేలా, ఆ పార్టీలకు, వారికి మద్దతుగా ఉండటం ఎంతవరకు సబబు? నాకు నష్టం కలిగించేలా కార్యక్రమాలు చేయడంపై పార్టీ పెద్దలు ఆలోచించాలి. ఇలాంటి వారు పార్టీలో ఉంటే నేను రాజకీయాలు చేయడం కష్టం. ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పనిచేస్తుంటే ప్రతిరోజు మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. వారిని నాయకులు ప్రోత్సహించడం బాధేస్తోంది. వారిని ఎలా కొనసాగించాలో ఆలోచించాలి’ అని రోజా ఆ ఆడియోలో పేర్కొన్నారు. ఇవాళ సీఎం జగన్‌ను కలిసి రోజా ఫిర్యాదు చేయడంతో నగరి రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. రోజా ఫిర్యాదుపై సీఎం జగన్‌ ఎలా స్పందిస్తారోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని