Nallala Odelu: తెరాసతో తెగదెంపులు.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు

తెలంగాణ ఉద్యమకారుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన సతీమణి, మంచిర్యాల జడ్పీ ఛైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మి తెరాసతో తెగదెంపులు చేసుకున్నారు. గురువారం మధ్యాహ్నం వారు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. దిల్లీ వెళ్లిన ఓదెలు దంపతులు..

Updated : 19 May 2022 15:52 IST

దిల్లీ: తెలంగాణ ఉద్యమకారుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన సతీమణి, మంచిర్యాల జడ్పీ ఛైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మి తెరాసతో తెగదెంపులు చేసుకున్నారు. గురువారం మధ్యాహ్నం వారు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. దిల్లీ వెళ్లిన ఓదెలు దంపతులు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. అనంతరం ఓదెలు దంపతులకు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఓదెలు 2009, 2014 ఎన్నికల్లో తెరాస తరఫున ఆయన విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2010లో జరిగిన ఉప ఎన్నికలోనూ ఆయన గెలుపొందారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రభుత్వ విప్‌గానూ ఓదెలు పనిచేశారు. భాగ్యలక్ష్మికి జడ్పీఛైర్‌పర్సన్‌ పదవీకాలం ఇంకా రెండేళ్లకు పైనే ఉంది.

అందుకే తెరాసను వీడారా?

చెన్నూరు నియోజకవర్గ తెరాసలోని విభేదాలే ఓదెలు దంపతులు పార్టీ వీడాలనే నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌తో అగాధం పెరగడం.. అతడితో విభేదాల కారణంగానే ఓదెలు పార్టీని వీడినట్లు సమాచారం. గత కొన్నిరోజులుగా సన్నిహితులు, అభిమానులు, కుటుంబసభ్యులతో ఓదెలు విస్తృతంగా చర్చించారు. ఈ క్రమంలోనే అందరి అభిప్రాయాలు తీసుకుని తెరాసను వీడి కాంగ్రెస్‌లో చేరాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఓదెలు తెరాసను వీడి కాంగ్రెస్‌లో చేరిన విషయం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని