Nara Lokesh: పోలీసులు పట్టించుకోరనే ఉన్మాదులు రెచ్చిపోతున్నారు: లోకేశ్‌

ఏపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే రాష్ట్రంలో రోజుకో అత్యాచారం, హత్య జరుగుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు.

Updated : 01 May 2022 11:28 IST

అమరావతి: ఏపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే రాష్ట్రంలో రోజుకో అత్యాచారం, హత్య జరుగుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. ఈ పరిస్థితి చూస్తుంటే ఏపీ బిహార్‌ను తలపిస్తోందని ఆక్షేపించారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమవడం వల్లే రేపల్లెలో ఓ వలస కూలీపై అత్యాచారం జరిగిందని మండిపడ్డారు. నిద్రిస్తున్న మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడటం హేయమైన చర్య అని లోకేశ్‌ అన్నారు. రాష్ట్రంలో ఏం చేసినా పోలీసులు పట్టించుకోరనే ధైర్యంతోనే ఉన్మాదులు ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో రోజుకో అత్యాచార ఘటన జరుగుతోందన్న లోకేశ్‌.. ప్రతిపక్షాలపై ఎదురుదాడి మాని నేరాలను అదుపు చేయాలని హితవు పలికారు. ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటే  రాబోయే రోజుల్లో మహిళలు పొరుగురాష్ట్రాలకు తరలి వెళ్లే భయానక పరిస్థితులు వస్తాయని లోకేశ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిపట్ల  కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి బయటకు వస్తే సీఎంకు విషయాలు తెలుస్తాయని లోకేశ్‌ చెప్పారు. మహిళల తప్పిదాల వల్లే అత్యాచారాలు జరుగుతున్నట్లు మాట్లాడతారా అని ప్రశ్నించారు. హోంమంత్రి మహిళ అయి ఉండి ఇలా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. 

ఏపీ బిహార్‌లా మారింది: అనగాని

రేపల్లె రైల్వేస్టేషన్‌లో మహిళపై అత్యాచారాన్ని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తీవ్రంగా ఖండించారు. భర్తను బెదిరించి భార్యపై ముగ్గురు అత్యాచారం చేయడం దారుణమని మండిపడ్డారు. భర్త పీఎస్‌కు వెళ్లి ఎన్నిసార్లు తలుపు కొట్టినా స్పందించలేదని అనగాని ఆరోపించారు. జగన్ పాలనలో ఏపీ బిహార్‌లా మారిందని ఆయన ధ్వజమెత్తారు. ఇంట్లో ఉన్నా, రైల్వేస్టేషన్, బస్టాండ్‌లలో కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆక్షేపించారు. ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకే పరిమితమవుతోందని అనగాని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. రేపల్లెలో ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడూ జరగలేదని అనగాని అన్నారు. లేని దిశ చట్టం పేరు చెప్పి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రంలో గంజాయి ప్రభావం ఎక్కువగా ఉందన్నారు.

తెదేపా శ్రేణుల ఆందోళన..

మహిళపై అత్యాచారం ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని రేపల్లెలో తెదేపా శ్రేణులు.. బాధితురాలు చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి బాధితురాలికి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు.

ఏపీని గంజాయి వనంగా మార్చారు: గొట్టిపాటి, ఏలూరి

రాష్ట్రాన్ని ప్రభుత్వం గంజాయి వనంగా మార్చిందని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావులు ధ్వజమెత్తారు. ఏపీలో మద్యం, గంజాయి తాగి మగాళ్లు మృగాళ్లుగా మారుతున్నారని ఆక్షేపించారు. వలస కూలీల లాగా మహిళలు త్వరలో ఏపీ నుంచి పక్క రాష్ట్రాలు వెళ్లే పరిస్థితులు ప్రభుత్వం కల్పిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో 1000 రోజుల జగన్ పాలనలో వేయి మంది మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు జరిగాయని వాపోయారు. ప్రకాశం జిల్లాకు చెందిన మహిళపై రేపల్లెలో సామూహిక అత్యాచారం జరగడం బాధాకరమని వారు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని