Nara Lokesh: కంచుకోటలో కాదు.. మీ పార్టీ గెలవని చోట పోటీ చేయగలరా?: జగన్‌కు లోకేశ్‌ సవాల్

ఏపీలో ప్రభుత్వ టెర్రరిజం నడుస్తోందంటూ పారిశ్రామిక వేత్తలు చెప్పారని.. ప్రముఖ కంపెనీలు బైబై ఏపీ అంటున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) అన్నారు. 

Updated : 06 Mar 2023 13:07 IST

పీలేరు: ఏపీలో ప్రభుత్వ టెర్రరిజం నడుస్తోందని పారిశ్రామిక వేత్తలు చెప్పారని.. ప్రముఖ కంపెనీలు బైబై ఏపీ అంటున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) అన్నారు. రాష్ట్రంలో జగన్‌ (CM Jagan) ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాలు నిల్‌.. గంజాయి ఫుల్‌ అన్నట్లు పరిస్థితి తయారైందని విమర్శించారు. పీలేరులో నిర్వహించిన మీడియా సమావేశంలో లోకేశ్‌ మాట్లాడారు. 

ఇప్పటికే ఒప్పందాలు జరిగిన కంపెనీలతో మళ్లీ ఎంవోయూలు కుదుర్చుకుని యువతను వైకాపా ప్రభుత్వం మోసం చేస్తోందని లోకేశ్‌ ఆరోపించారు. దావోస్‌ ఒప్పందాలను మళ్లీ విశాఖలోని గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మిట్‌లో చేసుకున్నట్లు చూపించారని ఆక్షేపించారు. విశాఖపట్నంలో జరిగింది గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మిట్‌ కాదని.. లోకల్‌ ఫేక్‌ సమ్మిట్‌ అని ఆయన ఎద్దేవా చేశారు. వైకాపా పాలనలో పీపీఏలు రద్దు చేయడంతో పాటు రాష్ట్రం నుంచి పరిశ్రమలను తరిమేశారన్నారు. జగన్‌ సీఎం అయ్యాక బాగుపడింది భారతి సిమెంట్‌ పరిశ్రమ మాత్రమేనని ఆరోపించారు. తెదేపా పాలనలో తెలంగాణ కంటే ఏపీకి ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. 

కంచుకోటలో గెలిచి గొప్పలు చెప్పడం కాదని.. వైకాపా గెలవని చోట పోటీ చేసి గెలిచే సత్తా జగన్‌కు ఉందా? అని లోకేశ్‌ సవాల్‌ విసిరారు. తెదేపాకు గతంలో ఏమాత్రం పట్టులేని మంగళగిరిలో గెలిచి కంచుకోటగా మారుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పరిశ్రమల ముందు సెల్ఫీ దిగి చూపిస్తున్నానని..  మీరు తీసుకొచ్చిన ఒక్క పరిశ్రమ ముందు అయినా సెల్ఫీ దిగి చూపించగలరా? అని జగన్‌కు ఛాలెంజ్‌ విసిరితే ఆయన స్వీకరించలేదని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు