Nara Lokesh: క్షమాపణ చెప్పే వరకు వాళ్లను వదిలిపెట్టను: నారా లోకేశ్‌

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య తర్వాత తెదేపా అధినేత చంద్రబాబుపై సాక్షి మీడియాలో దుష్ప్రచారం చేశారని

Published : 25 Feb 2022 01:38 IST

విశాఖపట్నం: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య తర్వాత తెదేపా అధినేత చంద్రబాబుపై ‘సాక్షి’ మీడియాలో దుష్ప్రచారం చేశారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. తమపై అసత్య కథనాలు ప్రచురించారన్నారు. సాక్షి దినపత్రికపై రూ.75కోట్లకు పరువు నష్టం దావా వేసిన నారా లోకేశ్ దీనికి సంబంధించి ఇవాళ విశాఖ కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పరువు నష్టం దావాకు సంబంధించి క్రాస్‌ ఎగ్జామినేషన్‌ కోసం కోర్టుకు వచ్చానన్నారు. తాను దావా వేసిన వాళ్లు కావాలని ఆలస్యం చేస్తున్నారని.. కానీ న్యాయమూర్తి ఎట్టి పరిస్థితుల్లో 28వ తేదీ కల్లా కౌంటర్‌ దాఖలు చేయాలని వాళ్లకు ఆదేశాలిచ్చారని చెప్పారు.  

‘‘నేను రాజకీయాల్లోకి రాకముందు నుంచి ‘సాక్షి’ నాపై దాడి చేస్తోంది. వ్యక్తిగత జీవితానికి సంబంధించి నాపై బురద జల్లింది. 2019 అక్టోబరులో ‘చినబాబు చిరుతిండి 25 లక్షలండి’ అనే శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైంది. దాన్ని చూసి మరో ఆంగ్ల పత్రిక, మరో నేషనల్‌ మ్యాగజైన్‌ కూడా కథనాలు ప్రచురించాయి. వాళ్ల ముగ్గురికీ నేను నోటీసులు జారీ చేశాను. అనంతరం మ్యాగజైన్‌ క్షమాపణ కోరింది. కానీ సాక్షి, మరో పత్రిక ఎక్కడా వివరణ ఇవ్వలేదు. నేను విషయంపై వివరణ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని వాళ్లు పబ్లిష్‌ చేయలేదు. అందుకే నేను సాక్షిపై పరువునష్టం దావా వేశాను. ఇది ఇక్కడితో ఆగదు. తప్పకుండా న్యాయ పోరాటం చేస్తా. నాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు.

మేం అలా మాట్లాడితే ఎలా ఉంటుంది?

రాజకీయాల్లో ఎదగకూడదని ఆ పత్రిక మాపై దుష్ప్రచారం చేస్తోంది. ఇలాంటి వాటికి మేం భయపడం. ఎవరైనా తప్పుడు వార్తలేస్తే తప్పనిసరిగా వాళ్లపై నేను పరువు నష్టం దావా వేస్తా. అన్ని రంగాలపై దాడి చేయడం జగన్‌ రెడ్డి ట్రేడ్‌మార్క్. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు. విజయలక్ష్మి గురించి, వైఎస్‌ భారతి గురించి, జగన్‌ కుమార్తెల గురించి మేం మాట్లాడితే ఎలా ఉంటుందో వాళ్లు ఆలోచించుకోవాలి. అది మా సంస్కృతి కాదు.. ఓ తల్లి ఎలా బాధపడుతుందో కొడుకుగా చూశా. ఎవరైతే అవమానకరంగా మాట్లాడారో వాళ్లు క్షమాపణ చెప్పే వరకు నేను వాళ్లను వదిలిపెట్టనని నేను నా తల్లికి శపథం చేస్తున్నాను’’ అని నారా లోకేశ్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని