
Ap News: ప్రాణాలతో చెలగాటమాడొద్దు.. సెలవులు పొడిగించండి: నారా లోకేశ్
అమరావతి: రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నందున విద్యాసంస్థలకు ప్రకటించిన సెలవులు పొడిగించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కోరారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్కు లోకేశ్ లేఖ రాశారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయని.. తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు మరో రెండు వారాల పాటు విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సెలవులు పొడిగిస్తూ తక్షణమే ఉత్తర్వులు జారీ చెయ్యాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
‘‘15 ఏళ్ల లోపు పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రాణాలతో చెలగాటమాడొద్దు. గత 10 రోజుల్లో ఏపీలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. 10 రోజుల వ్యవధిలోనే రోజుకి 500 కేసుల నుంచి 5 వేల వరకు నమోదయ్యే పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో పాఠశాలలు ప్రారంభించడం పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థుల తల్లిదండ్రులను మరింత మానసిక క్షోభకు గురిచెయ్యకుండా ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలి. తక్షణమే సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి’’ అని పేర్కొన్నారు.