Yuvagalam: ‘యువగళం’ పాదయాత్రకు సిద్ధమైన నారా లోకేశ్‌..

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈనెల 27 నుంచి ఏపీలో ‘యువగళం’ పాదయాత్రకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన నివాళులర్పించారు.

Updated : 25 Jan 2023 17:01 IST

హైదరాబాద్‌: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈనెల 27 నుంచి ఏపీలో ‘యువగళం’ పాదయాత్రకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన నివాళులర్పించారు. తెలంగాణ తెదేపా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌, సీనియర్‌ నేత కంభంపాటి రామ్మోహన్‌రావు తదితరులతో కలిసి అక్కడికి చేరుకుని తాత ఎన్టీఆర్‌కు పుష్పాంజలి ఘటించారు. ఎన్టీఆర్‌ ఘాట్‌కు లోకేశ్‌ వెళ్లే సమయంలో పెద్ద ఎత్తున యువత ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఆయన వాహన శ్రేణిని అనుసరిస్తూ ఘాట్‌ వద్దకు చేరుకున్నారు.

తొలుత ఇంటి వద్ద లోకేశ్‌ తన తల్లిదండ్రులు చంద్రబాబు, భువనేశ్వరి, అత్తమామలు బాలకృష్ణ, వసుంధర కాళ్లకు నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆయన సతీమణి నారా బ్రహ్మణి హారతిచ్చారు. ఆ తర్వాత లోకేశ్‌ ఎన్టీఆర్‌ ఘాట్‌కు వెళ్లారు. మామ బాలకృష్ణ దగ్గరుండి ఆయనను కారు ఎక్కించారు. లోకేశ్‌ రాకతో ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు పెద్ద ఎత్తున తెదేపా కార్యకర్తలు, నేతలు చేరుకున్నారు. దీంతో అక్కడ కోలాహలం నెలకొంది.

కడప పర్యటనకు..

లోకేశ్‌ ఎన్టీఆర్ ఘాట్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి కడప బయల్దేరారు. కడపలోని పలు ఆలయాలు, దర్గా, చర్చిల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించనున్నారు. కడప విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మొదటగా దేవుని కడపలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటారు. అమ్మవారిసమేత శ్రీవారి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అక్కడి నుంచి సమీపంలోని ప్రసిద్ధి గాంచిన పెద్ద దర్గాకు చేరుకుని ప్రత్యేక చాదర్‌ను సమర్పించి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. మతపెద్దల నుంచి ఆశీస్సులు అందుకుని అనంతరం మరియాపురంలోని రోమన్‌ కేథలిక్‌ చర్చికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. కడప నుంచి రాజంపేట, రైల్వేకోడూరు, కరకంబాడి మీదుగా రాత్రికి తిరుమలకు చేరుకోనున్నారు. గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని అనంతరం కుప్పం చేరుకుంటారు. శుక్రవారం ఉదయం కుప్పంలోని వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ‘యువగళం’ పాదయాత్రను లోకేశ్‌ ప్రారంభించనున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని