Nara Lokesh: సీఎం జగన్‌కు.. ఎన్నికలొస్తున్నాయనగానే అమరావతి గొప్పగా కనిపిస్తోంది: లోకేశ్‌

పేదలను మరింత పేదలుగా మార్చే కుట్రలో భాగమే ఆర్-5 జోన్ ఏర్పాటని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. సీఆర్‌డీఏ చట్టంలో పేదల నివాసానికి 5 శాతం భూమిని తెదేపా ప్రభుత్వం కేటాయించిందన్నారు. 

Published : 26 May 2023 22:34 IST

అమరావతి: పేదలను మరింత పేదలుగా మార్చే కుట్రలో భాగమే ఆర్-5 జోన్ ఏర్పాటని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. సీఆర్‌డీఏ చట్టంలో పేదల నివాసానికి 5 శాతం భూమిని తెదేపా ప్రభుత్వం కేటాయించిందన్నారు. మహానాడులో భాగంగా ఇవాళ నిర్వహించిన పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో లోకేశ్‌ మాట్లాడారు. 

‘‘రాజధానిగా అమరావతిని అవమానిస్తూ వచ్చిన సీఎం జగన్‌కు ఎన్నికలొస్తున్నాయనగానే అదే అమరావతి గొప్పగా కనిపిస్తోంది. రాజధానిగా అమరావతి ఉంటే భూముల ధరలు పెరుగుతాయని తెలుగుదేశం పార్టీ ఆనాడే చెప్పింది. అదే విషయాన్ని ఇవాళ ఎకరా రూ.10కోట్లు అంటూ జగన్‌ నిర్ధారించారు. మంగళగిరి ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న పేదలను బలవంతంగా ఖాళీ చేయించే కుట్ర జరుగుతోంది.

సెంటు భూమి ఇస్తున్నామనే సాకుతో పేదలను ఇప్పుడే నిరాశ్రయులను చేయాలని చూస్తున్నారు. అమరావతి బృహత్ ప్రణాళిక ప్రకారం పేదలకు ఇళ్లు ఇస్తే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే, అలాంటి సదుద్దేశం సీఎం జగన్‌కు లేదు. ఆమోదయోగ్యం కాని చోట ఆర్-5 జోన్ పేరుతో సెంటు భూమి ఇస్తున్నట్లు చెబుతూ ఆశ్రయం, ఉపాధి.. రెండూ లేకుండా చేస్తున్నారు. పనులు, అభివృద్ధి లేని చోట నివాసం ఏర్పాటు చేసుకొని పేదలు ఎలా బతకాలి?’’ అని లోకేశ్‌ ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని