nara lokesh-yuvagalam: కొత్త కంపెనీ వచ్చిందా? ఒక్కసారైనా జాబ్‌ క్యాలెండర్‌ ఇచ్చారా?: నారా లోకేశ్‌

జగన్ రెడ్డిని చూసి ఉన్న కంపెనీలు పక్క రాష్ట్రానికి తరలిపోతున్నాయని నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. ‘యువగళం’ పాదయాత్ర 7వ రోజు చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోకి ప్రవేశించింది. 

Published : 02 Feb 2023 16:07 IST

పలమనేరు: చిన్న, మధ్య తరగతి పరిశ్రమలను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. ‘యువగళం’ పాదయాత్ర 7వ రోజు చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోకి ప్రవేశించింది. తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి లోకేశ్‌ను పూలమాలలతో స్వాగతించారు. పాదయాత్రలో లోకేశ్‌ను కలిసిన న్యాయవాదులు వారి సమస్యలను వివరించారు. తెదేపా అధికారంలోకి రాగానే న్యాయవాదులకు ఇళ్ల పట్టాలు అందజేసే అంశాన్ని మేనిఫెస్టోలో పెడతామని లోకేశ్‌ వెల్లడించారు. పలమనేరులో అడిషినల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనంతరం పలమనేరు చరణ్‌ దాబా వద్ద ఎంఎస్‌ఎంఈ యూనియన్‌ ప్రతినిధులతో లోకేశ్‌ సమావేశమయ్యారు. అధికారంలోకి వచ్చాక ఎంఎస్‌ఎంఈల  సమస్యలు పరిష్కరిస్తామని లోకేశ్‌ హామీ ఇచ్చారు. 

అనంతరం పలమనేరు క్లాక్‌ టవర్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేశ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక్క కొత్త కంపెనీ వచ్చిందా? ఒక్కసారైనా జాబ్‌ క్యాలెండర్‌ ఇచ్చారా? ఒక్కరికైనా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా? అని ప్రశ్నించారు. జగన్ రెడ్డిని చూసి ఉన్న కంపెనీలు పక్క రాష్ట్రానికి తరలిపోతున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో టమోటా రైతులు ఇబ్బంది పడుతున్నారని.. వాళ్లకి తెదేపా అండగా నిలబడుతోందని భరోసా ఇచ్చారు. పట్టు రైతులకు గతంలో మాదిరి సబ్సిడీ, గిట్టుబాటు ధర అందిస్తామని లోకేశ్‌ హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని