Yuvagalam: వైకాపా చేసేది సామాజిక అన్యాయమే: లోకేశ్‌

సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్న వైకాపా నేతలు.. వారు మాత్రం సామాజిక అన్యాయమే చేస్తున్నారని నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. రెండో రోజు యువగళం పాదయాత్రలో భాగంగా కుప్పం నియోజకవర్గంలోని ప్రజలతో లోకేశ్‌ మాట్లాడారు.

Updated : 28 Jan 2023 13:49 IST

కుప్పం: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం నలగామపల్లిలో ఆయన పాదయాత్ర సాగుతోంది. యాత్రలో భాగంగా ప్రజల విజ్ఞప్తులను లోకేశ్ స్వీకరిస్తున్నారు. మధ్యలో నిర్మాణాలు నిలిపివేసిన కురుబ, వాల్మీకి వర్గాలకు చెందిన సామాజిక భవనాలను ఆయన పరిశీలించారు. ఈ భవనాలను పూర్తి చేయాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు లోకేశ్‌ దృష్టకి తీసుకొచ్చారు.

అనంతరం లోకేశ్‌ మాట్లాడుతూ.. ‘‘వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వివిధ వర్గాల ప్రజలకు రుణాలు, రాయితీలు ఏమైనా ఇచ్చారా? తెదేపా హయాంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నాం. సామాజిక న్యాయం గురించి వైకాపా నేతలు మాట్లాడుతున్నారు. కానీ, వారు చేసేది మాత్రం సామాజిక అన్యాయమే.. చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి.. తాడేపల్లి ప్యాలెస్‌లో ఎవరుంటారో మీకు తెలుసా..? విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక దొంగరెడ్డి, ఉత్తరాంధ్రను దొచుకొనే మరో రెడ్డి ఉంటారు. ఈ నలుగురే ఉంటారు. వైకాపా బీసీ నాయకులు మాత్రం గేటు బయటే ఉంటారు. మొదట మనలో చైతన్యం రావాలి. ప్రజలకు కావాల్సినవి చేసే బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. రేపు వస్తారుగా ఓట్లు అడిగేందుకు. అప్పుడు నిలదీద్దాం’’ అని లోకేశ్‌ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని