శివసేన కోటను బద్దలు కొట్టడమే లక్ష్యంగా..!

మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌ రాణె కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కింది. రాబోయే ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో మరింత పట్టు సాధించడమ....

Published : 08 Jul 2021 02:11 IST

నారాయణ్‌ రాణెకు కేంద్ర కేబినెట్‌లో చోటు

దిల్లీ: మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌ రాణేకు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కింది. రాబోయే ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో పట్టు సాధించడమే లక్ష్యంగా పక్కా వ్యూహంతో కేబినెట్‌లో కీలక మార్పులు చేర్పులు చేశారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని కొంకణ్‌ ప్రాంతంలో గట్టి పట్టున్న నేత నారాయణ్‌ రాణేకు మోదీ జట్టులో స్థానం కల్పించారు. శివసేనకు కొంకణ్‌ ప్రాంతంలో బలం ఉండటంతో దాన్ని ఢీకొట్టి భాజపాను మరింత పటిష్టం చేయడంలో భాగంగానే ఈ వ్యూహం రచించినట్టు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

నారాయణ్‌ రాణే పొలిటికల్‌ జర్నీ..
నారాయణ్‌ రాణే తన రాజకీయ జీవితంలో సుదీర్ఘ కాలం పాటు శివసేనలోనే ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి బయటకు వచ్చేశారు. అక్కడ ఆశాభంగం ఎదురవ్వడంతో సొంతంగా ఓ రాజకీయ పార్టీని స్థాపించారు. అనంతరం దాన్ని భాజపాలో విలీనం చేసి.. ప్రస్తుతం మోదీ జట్టులో స్థానం సంపాదించుకున్నారు. 69 ఏళ్ల నారాయణ రాణె తొలుత శివసేనలో శాఖ ప్రముఖ్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదిగి 1999లో శివసేన-భాజపా సంకీర్ణ ప్రభుత్వంలో అప్పటి సీఎం మనోహర్‌ జోషీ రాజీనామాతో దాదాపు తొమ్మిది నెలల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కొంకణ్‌ ప్రాంతంలో ఆయనకు మంచి పట్టుంది. శివసేనలో టిక్కెట్లు, పదవులు అమ్ముకొంటున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో నారాయణ్‌ రాణేను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ శివసేన అధినేత బాల్‌ ఠాక్రే 2005 జులైలో పార్టీ నుంచి బహిష్కరించారు. అదే సంవత్సరం ఆగస్టులో రాణే కాంగ్రెస్‌లో చేరారు. సెప్టెంబర్‌ 2017 వరకు కాంగ్రెస్‌లోనే ఉండి ఆ తర్వాత హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఆరు నెలల్లో సీఎంని చేస్తామని చెప్పి.. 12 ఏళ్లు ఎదురుచూసినా తనకు తగిన గుర్తింపు దక్కలేదంటూ కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవిని కూడా వీడారు. 2017 అక్టోబర్‌లో మహారాష్ట్ర స్వాభిమాన్‌ పక్ష పేరుతో సొంతంగా పార్టీ ప్రారంభించారు. 2018లో భాజపాకు మద్దతు ప్రకటించిన నారాయణ రాణే .. ఆ పార్టీ నామినేషన్‌పైనే రాజ్యసభకు ఎన్నికయ్యారు.  2019 అక్టోబర్‌లో కమలదళంలో చేరి తన పార్టీని కూడా విలీనం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని