Akhilesh: దేశంలో ప్రజాస్వామ్యం మనుగడపైనే ఆందోళన : అఖిలేష్‌

దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మనుగడ సాగిస్తాయా అనే విషయంపై ఆందోళన చెందుతున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ (Akhilesh Yadav) పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) అనర్హత వేటుపై కాంగ్రెస్‌ సత్యాగ్రహ దీక్ష చేయడంపట్ల ఆ పార్టీని అభినందిస్తున్నానని అన్నారు.

Published : 26 Mar 2023 19:50 IST

లఖ్‌నవూ: ఆయా రాష్ట్రాల్లో భాజపాపై పోరాటం చేస్తోన్న ప్రాంతీయ పార్టీలకే జాతీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ (Akhilesh Yadav) పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ ఈ విధంగా మాట్లాడిన ఆయన.. సత్యాగ్రహ దీక్ష చేపట్టినందుకు ఆ పార్టీని అభినందించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇక కాంగ్రెస్‌ (Congress) చేస్తోన్న ఆందోళనకు మద్దతు పలుకుతారా అన్న ప్రశ్నకు బదులిచ్చిన అఖిలేష్‌.. రాహుల్‌కు (Rahul Gandhi) మేము సానుభూతి ప్రకటిస్తామా..? లేదా అనేది ముఖ్య విషయం కాదని, దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మనుగడ సాగిస్తాయా అనేదే ప్రధాన అంశమని వ్యాఖ్యానించారు.

‘మాకు ఏ పార్టీపైనా సానుభూతి లేదు. ఆయా రాష్ట్రాల్లో భాజపాకు వ్యతిరేకంగా పోటీ చేస్తోన్న ప్రాంతీయ పార్టీలకే జాతీయ పార్టీలు మద్దతు ఇవ్వాలి. ప్రాంతీయ పార్టీలు హాని తలపెడుతాయా అన్న విషయాన్ని జాతీయ పార్టీలు మరచిపోవాలి. ప్రాంతీయ పార్టీలను లక్ష్యంగా చేసుకొని సీబీఐ, ఈడీ, ఇన్‌కంటాక్స్‌ విభాగాలు దాడులు చేస్తున్నాయి. అది ములాయం కావచ్చు, లాలూ ప్రసాద్‌ యాదవ్‌, జయలలిత, స్టాలిన్‌, కేసీఆర్‌, ఆమ్‌ఆద్మీపార్టీ.. ఇలా అన్ని పార్టీలను కేంద్రంలోని పార్టీలు లక్ష్యంగా చేసుకున్నాయి’ అని అఖిలేష్‌ యాదవ్‌ వెల్లడించారు.

కూటమి ఏర్పాటుపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన అఖిలేష్‌.. తమ పని కూటమి ఏర్పాటు చేయడం కాదని, దానికి మద్దతు పలకడమేనన్నారు. ఇక మతతత్వంపై స్పందించిన ఆయన.. ఎవరు మతతత్వవాది అనేది ప్రశ్న కాదన్నారు. దేశంలోని ఉన్నత విద్యావంతులు అవాస్తవాలనే నిజాలుగా నమ్ముతూ, మతతత్వవాదిగా మారితే సమాజానికి, ప్రజాస్వామ్యానికి అంతకంటే పెద్దముప్పు ఇంకేమీ లేదన్నారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితికి చేరుకున్నామని అఖిలేష్ యాదవ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని