Navjot Sidhu: ఆస్తి కోసం తల్లినే గెంటేశాడు.. సిద్ధూపై సోదరి సంచలన వ్యాఖ్యలు

పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్​ సింగ్​ సిద్ధూపై ఆయన సోదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తి కోసం తల్లిని, తనను ఇంట్లోంచి గెంటేశారని......

Published : 29 Jan 2022 02:13 IST

చండీగఢ్‌: పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్​ సింగ్​ సిద్ధూపై ఆయన సోదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తి కోసం తల్లిని, తనను ఇంట్లోంచి గెంటేశారని ఆరోపించారు. సిద్ధూ తండ్రి మొదటి భార్య కుమార్తె అయిన ప్రవాస భారతీయురాలు సుమన్‌ తూర్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తన తల్లి పడిన కష్టాలను వివరిస్తూ పలుమార్లు భావోద్వేగానికి గురయ్యారు.

కొద్దిరోజుల క్రితం అమెరికా నుంచి వచ్చిన అనంతరం సుమన్‌ తూర్‌ శుక్రవారం చండీగఢ్​లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిద్ధూపై తీవ్ర ఆరోపణలు చేశారు. కఠినాత్ముడంటూ వర్ణించారు. ‘1986లో మా తండ్రి భగవత్​ సింగ్​ సిద్ధూ మృతిచెందిన అనంతరం మా కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత కుటుంబ ఆస్తిని దక్కించుకునేందుకు నన్ను, మా తల్లిని సిద్ధూ ఇంట్లోంచి గెంటేశాడు. మా పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. నా తల్లి నాలుగు నెలలు ఆసుపత్రికే పరిమితమైంది. 1989లో దిక్కులేనిదానిలా దిల్లీ రైల్వేస్టేషన్​లో మరణించింది’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

1987లో ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రులు విడిపోయారని సిద్ధూ  అబద్ధం చెప్పాడని సుమన్‌ పేర్కొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిందంతా అబద్ధమని ఆమె ఆరోపించారు. తన తల్లి కోల్పోయిన గౌరవాన్ని తిరిగి తీసుకొచ్చేందుకే ఇప్పుడు భారత్​కు వచ్చినట్లు సుమన్ తెలిపారు​. తన తల్లికి న్యాయం కావాలని కోరారు. జనవరి 20న అమృత్​సర్​లోని సిద్ధూ ఇంటికి వెళ్లానని కానీ.. గేటు తీసేందుకు కూడా తన సోదరుడు అంగీకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు​. తన ఫోన్‌ నంబర్‌ను కూడా బ్లాక్‌ చేసినట్లు తెలిపారు.

కొద్ది రోజుల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న తరుణంలో సిద్ధూపై ఇలాంటి విమర్శలు రావటం అక్కడి రాజకీయాల్లో కలకలం రేపుతోంది. పంజాబ్‌ కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థుల రేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీతోపాటు సిద్ధూ కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే సీఎం అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తామని ఆ పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ గురువారం తెలిపారు. కార్యకర్తల అభిప్రాయం తీసుకొనే అభ్యర్థి పేరును వెల్లడిస్తామని పేర్కొన్నారు. అయితే సోదరి ఆరోపణలు సిద్ధూ అభ్యర్థిత్వంపై ప్రభావం చూపనున్నాయని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆమె ఎవరో కూడా నాకు తెలియదు: సిద్ధూ భార్య

సుమన్‌ ఆరోపణలను సిద్ధూ భార్య నవజ్యోత్‌ కౌర్‌ సిద్ధూ కొట్టిపారేశారు. సిద్ధూ తండ్రి మొదటి భార్యకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారన్న విషయం కూడా తనకు తెలియదు అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని