
సిద్ధూ..జాఖడ్‌ని కలవడం వెనక మర్మమేంటి?
దిల్లీ: పంజాబ్ రాజకీయాలు రోజు రోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. రాష్ట్ర మాజీ మంత్రి నవజ్యోత్‌సింగ్ సిద్ధూకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు సునిల్ జాఖడ్‌తో ఆయన భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పంచకులలోని జాఖడ్ నివాసానికి వెళ్లి కొద్ది సేపు మాట్లాడారు. అయితే ఇది మర్యాద పూర్వక భేటీ మాత్రమేనని సిద్ధూ వెల్లడించారు.
సిద్ధూకు పీసీసీ అధ్యక్ష పదవి అప్పగించే అంశంపై ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి కూడా ఆయన లేఖ రాశారు. అన్ని వర్గాలకు చెందిన సీనియర్లను, పార్టీని ఎప్పటినుంచో నమ్ముకొని ఉన్నవారిని కాదని సిద్ధూను పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని అందులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్, సిద్ధూల మధ్య గత కొన్ని రోజులుగా రాజకీయ విభేదాలు భగ్గుమంటున్నాయి. వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు పార్టీ వ్యవహారాల బాధ్యుడు హరీశ్ రావత్ ఓ వైపు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇవాళ సాయంత్రం సీఎంతో భేటీ కానున్నారు. ఈ సమావేశం జరగడానికి ముందే సునీల్ జాఖడ్‌ను సిద్ధూ కలవడం గమనార్హం.
మరోవైపు ఇటీవల సోనియా గాంధీతో భేటీ అయిన అనంతరం అమరీందర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. సిద్ధూపై తనకు వ్యతిరేక అభిప్రాయం ఉన్నప్పటికీ.. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వెల్లడించారు. దీనిని బట్టి పార్టీ అధిష్ఠానం నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చిన తర్వాతనే సీఎం ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి అభ్యంతరం వ్యక్తం చేసినా పంజాబ్ కాంగ్రెస్ పగ్గాలను సిద్ధూకి అప్పగించేందుకే అధిష్ఠానం మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.