
Punjab: గృహిణులకు నెలకు రూ.2వేల నగదు.. ఉచితంగా 8 గ్యాస్ సిలిండర్లు..!
నవజోత్ సింగ్ సిద్ధూ ఎన్నికల వరాలు
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ.. మహిళలకు ఎన్నికల వరాలు ప్రకటించారు. తమకు ఓటేసి గెలిపిస్తే గృహిణులకు ప్రతి నెలా రూ.2వేల నగదుతో పాటు.. ఏడాదికి 8 వంటగ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు.
బర్నాలా జిల్లాలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో సిద్ధూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సాధికారత కోసం తమ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే తాము మళ్లీ అధికారంలోకి వస్తే గృహిణులకు నెలకు రూ. 2వేల నగదుతో పాటు ఏడాదికి 8 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామని తెలిపారు. అంతేగాక, బాలికల విద్య కోసం నగదు ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించారు. ఐదో తరగతి పూర్తి చేసిన బాలికలు రూ. 5వేలు, పదో తరగతి పాసైన అమ్మాయిలకు రూ. 15వేలు, 12వ తరగతి పాసైన యువతులకు రూ. 20వేల నగదు ప్రోత్సాహకాలు అందిస్తామని వెల్లడించారు. ఇక ఉన్నత విద్య కోసం అడ్మిషన్ తీసుకునే అమ్మాయిలకు ద్విచక్రవాహనాలు, కంప్యూటర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆస్తులను మహిళల పేరు మీదకు బదలాయిస్తే ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని అన్నారు. మహిళల కోసం రాష్ట్రవ్యాప్తంగా 28 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని సిద్ధూ హామీ ఇచ్చారు.
ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మహిళల కోసం ఇలాంటి హామీలను ప్రకటించిన విషయం తెలిసిందే. పంజాబ్‌లో తమకు ఓటేస్తే మహిళలందరికీ రూ.1000 నగదుతో పాటు 300 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
పంజాబ్ శాసనసభ గడువు మరో మూడు నెలల్లో ముగియనుంది. దీంతో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. మార్చి, ఏప్రిల్‌లో అక్కడ ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. దీనిపై మరికొద్ది రోజుల్లో షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలను ముమ్మరం చేశాయి. గత కొంతకాలంగా పార్టీలో అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు సవాల్‌గా మారాయి. అటు భాజపా కూడా ఈ సారి అధికారం కోసం గట్టిగానే శ్రమిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి సొంతంగా పార్టీ స్థాపించిన సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో కాషాయ పార్టీ పొత్తు పెట్టుకుంది. మరోవైపు ఇటీవల జరిగిన చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించి ఉత్సాహంగా ఉంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.