Punjab Politics: ‘కెప్టెన్‌’పై తిరుగుబాటు.. సీఎం సతీమణి ఏమన్నారంటే?

పంజాబ్‌లోని అధికార కాంగ్రెస్‌ పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్ సతీమణి, ఆ పార్టీ ఎంపీ ప్రణీత్‌ కౌర్‌ స్పందించారు.......

Published : 26 Aug 2021 01:18 IST

చండీగఢ్‌: పంజాబ్‌లోని అధికార కాంగ్రెస్‌ పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్ సతీమణి, ఆ పార్టీ ఎంపీ ప్రణీత్‌ కౌర్‌ స్పందించారు. సీఎం అమరీందర్‌ సింగ్‌ రాజీనామా చేయాలంటున్న అసమ్మతి నేతలపై మండిపడ్డారు. 2022లో ఎన్నికలు జరగనున్న వేళ ఇలాంటి చర్యలు పార్టీకి నష్టం చేస్తాయని వారు గుర్తుంచుకోవాలని సూచించారు. రాష్ట్ర పార్టీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులకు పీసీసీ చీఫ్‌ సిద్ధూదే బాధ్యతన్నారు. అమరీందర్‌సింగ్‌ నాయకత్వాన్ని ఆమె ప్రశంసించారు. ఆయన సారథ్యంలో పార్టీ అనేక విజయాలు సాధించిందని, పంజాబ్‌ను అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్నారని కితాబిచ్చారు. కరోనా నియంత్రణలోనూ బాగా పనిచేశారన్నారు.

నలుగురు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌పై తిరుగుబావుటా ఎగురవేయడం కాంగ్రెస్‌ కలకలం సృష్టించింది. ‘కెప్టెన్‌’పై తాము విశ్వాసం కోల్పోయామని, ఎన్నికల  హామీలను నెరవేర్చడంలో ఆయన విఫలమయ్యారంటూ నేతలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రణీత్‌ కౌర్‌ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో  పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు నేతలంతా సమష్టిగా, సానుకూల పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. నాలుగున్నరేళ్ల తర్వాత కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తంచేయడంపై అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. ‘గత నాలుగున్నరేళ్లలో వారు సంతృప్తిగా ఉన్నారా.. వాళ్లనే అడగండి’ అని వ్యాఖ్యానించారు. ఇలాంటి పనులకు ఇది సమయం కాదని, పార్టీకి నష్టం జరుగుతుందన్నారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో పరిశీలించాలని, పార్టీకి ఏది మంచిదో అదే చేయాలన్నారు. 

నవ్‌జ్యోత్‌ సింగ్ సిద్ధూకి పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించాక అమరీందర్‌ సింగ్‌ పరిపక్వతతో వ్యవహరించడంతో పాటు గొప్ప హృదయంతో స్పందించారని ప్రణీత్‌ కౌర్‌ అన్నారు. హైకమాండ్‌ నిర్ణయం తర్వాత సిద్ధూ వచ్చినప్పుడు పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి తాను కట్టబడి ఉంటానని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని