Punjab polls 2022: సిద్ధూకి పోటీగా అతడు... అకాలిదళ్‌ కీలక ఎత్తుగడ

పంజాబ్‌ ఎన్నికల్లో బరిలో నిలిచిన శిరోమణి అకాలీదళ్‌ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్‌లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే అమృత్‌సర్‌ (ఈస్ట్‌) నియోజకవర్గం........

Published : 27 Jan 2022 01:24 IST

చండీగఢ్‌: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బరిలో నిలిచిన పార్టీలు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ కీలక నేతలను ప్రాముఖ్యం ఉన్న స్థానాల్లో పోటీకి దింపుతున్నాయి. పంజాబ్‌ ఎన్నికల్లో బరిలో నిలిచిన శిరోమణి అకాలీదళ్‌ తాజాగా అలాంటి నిర్ణయమే తీసుకుంది. పంజాబ్‌లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే అమృత్‌సర్‌ (ఈస్ట్‌) నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూకి పోటీగా.. మాజీ మంత్రి బిక్రమ్‌ మజీతియాను నిలబెడుతున్నట్లు పార్టీ ప్రకటించింది. డ్రగ్స్‌ కేసులో కొద్దిరోజుల క్రితం బిక్రమ్‌ అరెస్టవడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆయన అరెస్టు విషయంతో సిద్ధూ కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం.

బిక్రమ్‌ మజీతియా 2012, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో అమృత్‌సర్‌ జిల్లాలోని మజితా నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే బిక్రమ్‌ మాదకద్రవ్యాల దందా నిర్వహిస్తున్నారంటూ ఆరోపణలు రావడం పంజాబ్‌ రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ విషయంపై మండిపడ్డ రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ సిద్ధూ.. బిక్రమ్‌ను అరెస్టు చేయించేంతవరకు నిద్రపోనని శపథం చేశారు. గత డిసెంబర్‌లో బిక్రమ్‌ ఈ కేసులో అరెస్టయ్యారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసును ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తోంది. ఈ వివాదం నేపథ్యంలోనే సిద్ధూని బిక్రమ్‌ చేత ఓడించాలని భావిస్తున్న అకాలిదళ్‌.. అమృత్‌సర్‌ (ఈస్ట్‌) నుంచే బిక్రమ్‌ను పోటీకి నిలబెట్టింది. అయితే సిద్ధూకి తిరుగులేని ఈ స్థానంలో వీరి పోటీ ఎలా ఉండబోతోంది? ఎవరు గెలుపొందుతారో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని