Punjab Polls: సిద్ధూ ఆస్తి ఎంతోతెలుసా? ఆయనఆదాయ వనరులివే..!

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. మాజీ క్రికెటర్‌,  పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నవ్‌జోత్‌ సింగ్ సిద్ధూ అమృత్‌సర్‌లో శనివారం నామినేషన్‌ వేశారు.......

Published : 30 Jan 2022 01:53 IST

చండీగఢ్‌: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. శనివారం మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నవ్‌జోత్‌ సింగ్ సిద్ధూ అమృత్‌సర్‌లో నామినేషన్‌ వేశారు. అమృత్‌సర్‌ తూర్పు నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్న సిద్ధూ ఈ మేరకు తన నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. తనకు మొత్తంగా రూ.44.63 కోట్ల ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్‌లో వెల్లడించారు. తన వద్ద ఉన్న స్థిర, చరాస్తుల్లో తన సతీమణి, మాజీ ఎమ్మెల్యే నవ్‌జోత్‌ కౌర్‌ సిద్ధూ వద్ద రూ.3.28 కోట్లు ఉండగా.. తన వద్ద రూ.41.35 కోట్ల ఆస్తులు ఉన్నాయన్నారు.

గత ఎన్నికల సమయంలో (2016-2017) తన వార్షిక ఆదాయం రూ.94.18 లక్షలు ఉండగా.. 2020-2021 ఆర్థిక సంవత్సరానికి రూ.22.58 లక్షలకు తగ్గిందని పేర్కొన్నారు. ఇక, చరాస్తుల విషయానికి వస్తే రూ.1.19 కోట్లు విలువైన రెండు టయోటా ల్యాండ్‌ క్రూయిజర్లు, రూ.11.43 కోట్ల విలువైన టయోటా ఫార్చ్యూనర్ వాహనం‌తో పాటు రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.44 లక్షల విలువచేసే వాచ్‌లు ఉన్నట్టు సిద్ధూ వివరించారు. తన సతీమణి వద్ద రూ.70లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్నాయని తెలిపారు.

ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే.. పటియాలాలో తనకు ఆరు షోరూమ్‌లు ఉన్నాయని వెల్లడించిన సిద్ధూ.. వ్యవసాయ భూమి మాత్రం లేదని పేర్కొన్నారు. అలాగే, పటియాలాలో తనకు వారసత్వంగా వచ్చిన 1200 చదరపు గజాల ఇంటి విలువ రూ.1.44 కోట్లుగా పేర్కొన్నారు. దీంతో పాటు అమృత్‌సర్‌లో రూ.34కోట్ల విలువ చేసే 5,114 చదరపు గజాల నివాసయోగ్యమైన ఆస్తులు ఉన్నట్టు తెలిపారు. పంజాబ్‌ యూనివర్సిటీ 1986లో బీఏ పూర్తి చేసినట్టు తెలిపిన సిద్ధూ.. అద్దెలు, బీసీసీఐ నుంచి వచ్చే పింఛను, ఎమ్మెల్యేగా వస్తున్న జీతమే తనకు ఆదాయ వనరులని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని