Sharad Pawar: ‘శరద్‌ పవారే కొనసాగాలి..’ రాజీనామా తిరస్కరించిన NCP కమిటీ

పార్టీ అధ్యక్షుడిగా శరద్‌ పవార్‌ (Sharad Pawar) రాజీనామాను ఎన్‌సీపీ తిరస్కరించింది. దీంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

Updated : 05 May 2023 15:05 IST

ముంబయి: పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతూ శరద్‌ పవార్‌ (Sharad Pawar) తీసుకున్న సంచలన నిర్ణయం నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (NCP) నేతలు, కార్యకర్తల్లో తీవ్ర కలవరం రేపింది. పవార్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజీనామా నిర్ణయాన్ని చర్చించడంతో పాటు పార్టీ నూతన అధ్యక్షుడి ఎంపిక కోసం ఎన్‌సీపీ కమిటీ శుక్రవారం సమావేశమైంది. పవార్‌ రాజీనామాను ఈ కమిటీ తిరస్కరించింది.

సుప్రియా సూలే, అజిత్‌ పవార్‌, ప్రఫుల్‌ పటేల్‌, ఛగన్‌ భుజ్‌బల్‌ సహా 18 మంది సభ్యులుగా ఉన్న ఈ కమిటీ శుక్రవారం ఉదయం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో శరద్‌ పవార్‌ (Sharad Pawar) రాజీనామాను తిరస్కరిస్తూ ఓ తీర్మానం ప్రవేశపెట్టగా దాన్ని కమిటీ ఆమోదించింది. పార్టీ (NCP) అధినాయకుడిగా పవార్‌ కొనసాగాలని అభ్యర్థిస్తూ మరో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది.

ఈ సందర్భంగా ఎన్‌సీపీ (NCP) ఉపాధ్యక్షుడు ప్రఫుల్‌ పటేల్‌ మాట్లాడుతూ.. ‘‘పవార్‌ సాహెబ్‌ మాకు చెప్పకుండా రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ విషయంలో పార్టీ కార్యకర్తల నుంచి వస్తున్న డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని ఈ రోజు మేం సమావేశమయ్యాం. ఆయన రాజీనామాను తిరస్కరించాం. పార్టీ అధ్యక్షుడిగా ఆయనే కొనసాగాలి’’ అని తెలిపారు. కమిటీ నిర్ణయంతో ఎన్‌సీపీ కార్యాలయం వెలుపల పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. 

అయితే కమిటీ నిర్ణయంపై పవార్‌ (Sharad Pawar) ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోనున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్‌సీపీ అధ్యక్షుడిగా కొనసాగడంపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని నిన్న శరద్‌పవార్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అధ్యక్షుడిగా పవార్‌ను కొనసాగిస్తూ.. కొత్తగా కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని తీసుకురావాలని ఎన్‌సీపీ భావిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే ఆ పదవిలోకి ఎవరిని తీసుకుంటారనేది ఇంకా స్పష్టత లేదు. ఈ బాధ్యతలకు పవార్‌ కుమార్తె సుప్రియా సూలే పేరు బలంగా వినిపిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని