AAP: ‘ఆర్డినెన్స్‌’పై పోరాటం ముమ్మరం.. శరద్‌ పవార్‌తో కేజ్రీవాల్‌ భేటీ!

దిల్లీ పాలనావ్యవహారాల విషయంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై అక్కడి ఆప్‌ ప్రభుత్వ పోరాటానికి మద్దతు ఇస్తున్నట్లు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ప్రకటించారు. దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నేడు పవార్‌ను ముంబయిలో కలిసిన సందర్భంగా ఈ మేరకు మాట్లాడారు.

Published : 25 May 2023 19:43 IST

ముంబయి: దిల్లీ (Delhi)లో ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీల విషయంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌(Ordinance)పై ఆప్‌ ప్రభుత్వం తన పోరాటాన్ని ముమ్మరం చేసింది. ఈ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆయా పార్టీల మద్దతు కూడగడుతోన్న దిల్లీ సీఎం, ఆప్‌ (AAP) కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal).. తాజాగా ఎన్సీపీ (NCP) అధినేత శరద్‌ పవార్‌ (Sharad Pawar)ను కలిశారు. పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ (Bhagwant Mann)తో కలిసి ముంబయికి వచ్చిన కేజ్రీవాల్‌.. ఇక్కడ పవార్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆర్డినెన్స్‌పై పోరాటం విషయంలో శరద్‌ పవార్‌ తమకు మద్దతు పలికారని వెల్లడించారు.

ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాలను ఆర్డినెన్సులను ఉపయోగించి పనిచేయనీయక పోవడం దేశానికి మంచిది కాదని కేజ్రీవాల్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య మనుగడ కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు. ఒకవేళ భాజపాయేతర పక్షాలన్నీ ఏకమైతే.. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను రాజ్యసభలో ఓడించవచ్చని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఆప్‌ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచేలా చూడటం మన కర్తవ్యమని శరద్‌ పవార్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఆర్డినెన్స్‌పై పోరులో భాగంగా కేజ్రీవాల్‌ ఇప్పటికే బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నీతీశ్‌కుమార్‌, పశ్చిమ బెంగాల్‌ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తదితర నేతలతో సమావేశమయ్యారు.

‘ఇప్పుడు భాజపాకు ఎన్డీయే గుర్తొచ్చింది..’

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే ‘ఎన్డీయే’ అనే అంశాన్ని భాజపా తెరపైకి తెచ్చిందని నేషనలిస్ట్ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. నూతన పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని 19 పార్టీలు బహిష్కరించిన నేపథ్యంలో ఆ పార్టీ ఎన్డీయే పేరుతో ఓ ప్రకటన విడుదల చేసిందని ఎన్సీపీ అధికార ప్రతినిధి క్లైడ్‌ క్రాస్టో పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో సొంతంగా గెలవలేమని అర్థమైంది కాబట్టే భాజపాకు ఇప్పుడు భాగస్వామ్య పక్షాలు గుర్తొచ్చాయని దుయ్యబట్టారు. పార్లమెంట్‌లో ఎలాంటి చర్చలూ లేకుండా బిల్లులు ఆమోదించుకుంటున్న ఎన్డీయే సర్కారు.. ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడటం సరికాదని ఎద్దేవా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని