Kejriwal: కేంద్రం సహకారం.. ప్రధాని మోదీ ఆశీర్వాదం అవసరం: కేజ్రీవాల్‌

దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(MCD)లో 15ఏళ్ల భాజపా(BJP) పాలనకు చరమగీతం పాడుతూ ప్రజలు ఇచ్చిన తీర్పు పట్ల ఆప్‌(AAP) జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) హర్షం వ్యక్తంచేశారు.

Published : 07 Dec 2022 16:23 IST

దిల్లీ: దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(MCD)లో ప్రజలు ఇచ్చిన తీర్పు పట్ల ఆప్‌(AAP) జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) హర్షం వ్యక్తంచేశారు. తమ పార్టీకి ఘన విజయం అందించిన దిల్లీవాసులకు కృతజ్ఞతలు చెప్పారు. దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(Muncipal corporation of Delhi) నిర్వహించే బాధ్యతను ‘మీ కొడుకు, సోదరుడి’కి అప్పగించినందుకు కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. దిల్లీలోని ఆప్‌ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో మార్పు తీసుకొచ్చినందుకు ప్రజలకు థాంక్స్‌ చెప్పిన కేజ్రీవాల్‌.. దిల్లీ ప్రజల ఆకాంక్షల్ని సాకారం చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. దిల్లీ నగర పరిస్థితి మరింతగా మెరుగుపరిచేందుకు భాజపా, కాంగ్రెస్‌ పార్టీలతో పాటు కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ ఆశీర్వాదం కావాలన్నారు. పరిశుభ్రమైన నగరంగా దిల్లీని తీర్చిదిద్దేందుకు రాజకీయ పార్టీలన్నీ కలిసి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అలాగే, ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ఆప్‌, భాజపా, కాంగ్రెస్‌, స్వతంత్ర అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు చెప్పారు. 

దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ప్రస్తుతం ఉన్న అవినీతి, లంచగొండితనాన్ని నిర్మూలించి అవినీతి రహితంగా మారుస్తామన్నారు. తమ తీర్పుతో ఈరోజు దిల్లీ ప్రజలు యావత్‌ దేశానికి ఓ సందేశం ఇచ్చారని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. అంతకముందు డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా మాట్లాడుతూ.. ఆప్‌ను గెలిపిస్తూ తీర్పు ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఆప్‌కు ఇచ్చింది కేవలం విజయం మాత్రమే కాదని.. దిల్లీని మరింత పరిశుభ్రంగా, మెరుగైన నగరంగా తీర్చిదిద్దే అతిపెద్ద బాధ్యత అన్నారు. 

ఆప్‌ కార్యాలయం వద్ద కోలాహలం

దిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. పార్టీ నేతలు, కార్యకర్తల హర్షాతిరేకాలు, పాటలతో సందడి చేశారు. అక్కడికి చేరుకున్న పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు పార్టీ జెండాలు పట్టుకొని మిఠాయిలు పంచుకుంటూ నృత్యాలతో ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో భారత్‌ మాతాకీ జై, ఇంక్విలాబ్‌ జిందాబాద్‌, వందేమాతరం వంటి నినాదాలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. దిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఆప్‌ ఘన విజయం సాధించింది. 130కి పైగా స్థానాల్లో గెలుచుకొని మేయర్‌ పీఠాన్నికైవసం చేసుకుంది. ఈ నెల 4న దిల్లీ కార్పొరేషన్‌లోని 250 స్థానాలకు ఎన్నికలు జరగ్గా..  100కు పైగా స్థానాల్లో భాజపా గెలవగా.. కాంగ్రెస్‌ కేవలం 9 స్థానాలకే పరిమితమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని