అంతర్గత వ్యవహారాల్లో  బయటివారి సలహాలు అక్కరలేదు!

దేశ అంతర్గత వ్యవహారాల్లో బాహ్య శక్తుల ప్రమేయం గురించి ఉపాధ్యక్షుడు వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌ సమస్యను పరిష్కరించడానికి ఇతరదేశాల సలహాలు అవసరం లేదని,

Updated : 10 Apr 2021 16:27 IST

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్య


శ్రీనగర్‌: దేశ అంతర్గత వ్యవహారాల్లో బాహ్య శక్తుల ప్రమేయం గురించి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌ సమస్యను పరిష్కరించడానికి ఇతరదేశాల సలహాలు అవసరం లేదని, యూనియన్‌ టెర్రిటరీ (యూటీ) పూర్తిగా భారత దేశంలోని భాగమని స్పష్టం చేశారు.

శుక్రవారం జమ్మూలో జరిగిన ఇండియన్‌ ఇన్‌స్టి‌ట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఎమ్‌ఎమ్‌) మూడో, నాలుగో స్నాతకోత్సవంలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర దేశాలు భారత దేశానికి సలహాలు ఇవ్వడం మాని, తమ సొంత సమస్యల గురించి ఆలోచించాలని సూచించారు. ఏ దేశం కూడా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కానీ, వ్యాఖ్యలు చేయడం కానీ సరికాదని తెలిపారు. భారతదేశ ప్రజాస్వామ్యం, నాగరికత పట్ల తమకు అమితమైన విశ్వాసం ఉందన్నారు. నిజంగా నాగరికత ఉన్నవాళ్లైతే ఇతర దేశాల వ్యవహారాల్లో వేలు పెట్టరని అన్నారు. 

‘‘ దేశీయ సమస్యలను పరిష్కరించడానికి కొందరు మిత్రులు అనవసరంగా సలహాలు ఇస్తున్నారు. మేము మా సమస్యలను పరిష్కరించుకోగలం. మా గురించి మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవరసరం లేదు. మేము చేసే అన్ని పనులపై మాకు అవగాహన ఉంది. కొన్ని బాహ్య శక్తులు దేశ ప్రగతిని దెబ్బతీసేలా సమస్యలను సృష్టిస్తున్నాయి. వారి ప్రయత్నాలు విఫలం చేయాలి’’ అన్నారు. జాతీయ సమైక్యత కోసం పోరాడి దేశాన్ని అగ్రస్థానంలో నిలపాలని సందేశాన్నిచ్చారు. 

రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. ప్రగతి సాధించాలంటే శాంతి అవసరమని అన్నారు. ఆందోళన చెందితే దేనిమీదా శ్రద్ధ పెట్టలేరని, ప్రశాంత చిత్తంతో ఉండాలని విద్యార్థులకు హితబోధ చేశారు. పరిశ్రమ, ఇన్‌స్టిట్యూట్‌ అనుసంధానాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ను మెరుగు పరచడానికి రైతులతో కలిసి పనిచేయాలని విద్యార్థులను కోరారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఐఎమ్‌ఎమ్‌ లాంటి సంస్థలు‌ వినూత్న కోర్సులను, డిప్లమోలను ప్రవేశపెట్టాలని పిలుపునిచ్చారు. ఉన్నత విద్యను ప్రోత్సహించాలని, సృజనాత్మకతను పెంపొందించేలా సంస్థాగత సంస్కరణలను తీసుకురావాలని నొక్కి చెప్పారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని