NEET Row: ‘నీట్‌’ లీకేజీలో 14 మంది కేంద్ర మంత్రుల ప్రమేయం

నీట్‌ పేపర్‌ లీకేజీలో 14 మంది కేంద్ర మంత్రులకు ప్రమేయం ఉందని యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆరోపించారు. లీకేజీకి నిరసనగా ఆదివారం యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు రాష్ట్ర భాజపా కార్యాలయ ముట్టడికి బయలుదేరగా గాంధీభవన్‌ గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు.

Published : 24 Jun 2024 03:49 IST

యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆరోపణ
భాజపా రాష్ట్ర కార్యాలయ ముట్టడి యత్నం

గాంధీభవన్‌ వద్ద యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట

ఈనాడు, హైదరాబాద్‌- కరీంనగర్‌(భగత్‌నగర్‌), న్యూస్‌టుడే: నీట్‌ పేపర్‌ లీకేజీలో 14 మంది కేంద్ర మంత్రులకు ప్రమేయం ఉందని యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆరోపించారు. లీకేజీకి నిరసనగా ఆదివారం యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు రాష్ట్ర భాజపా కార్యాలయ ముట్టడికి బయలుదేరగా గాంధీభవన్‌ గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. వారిని బయటికి రానివ్వకుండా బారికేడ్లు అడ్డుగా పెట్టి గేట్లు మూసివేశారు. ఈ సందర్భంగా శివసేనారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..  కేంద్ర మంత్రుల పిల్లల కోసం నీట్‌ పేపర్‌ లీక్‌ చేశారని ఆరోపించారు. అసలు నిజాలు బయటపడితే కేంద్ర ప్రభుత్వం కుప్పకూలుతుందన్న భయంతో పరీక్ష రద్దుకు వెనకాడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్‌ చేయాలన్నారు. అంతకుముందు ఇందిరా భవన్‌లో జరిగిన యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పీసీసీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం యువతకు, విద్యార్థులకు ప్రాధాన్యమిస్తుందని, పార్టీలో అనేక మంది యువకులు ఎంతో గొప్ప నాయకులుగా ఎదిగారని పేర్కొన్నారు. 


కరీంనగర్‌లో బండి సంజయ్‌ కార్యాలయం ముట్టడికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో రహదారిపై బైఠాయించిన నాయకులు 

కరీంనగర్‌లో విద్యార్థి సంఘాల ఆందోళన 

నీట్‌ రద్దు కోరుతూ విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నాయకులు ఆదివారం కరీంనగర్‌లోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ క్యాంప్‌ కార్యాలయం ముట్టడికి యత్నించారు. ర్యాలీగా కార్యాలయం వద్దకు వెళ్తుండగా పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో వారు రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శనిగరపు రజనీకాంత్‌లు మాట్లాడుతూ.. నీట్‌ రాసిన 24 లక్షల మంది విద్యార్థుల భవితవ్యంపై నోరుమెదపని బండి సంజయ్‌కి కేంద్ర సహాయ మంత్రిగా కొనసాగే నైతిక హక్కులేదని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు తిరిగి కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని బలవంతంగా వాహనాల్లో తరలించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు మునిగంటి అనిల్, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి బాలసాని లెనిన్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామారావు, వెంకటేశ్, మచ్చ రమేశ్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అరవింద్, గజ్జల శ్రీకాంత్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాణాప్రతాప్, అంగడి కుమార్, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు నరేశ్‌ పటేల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని