BJP: భారత తొలి ప్రధాని నెహ్రూ కాదు.. నేతాజీ!

భారత తొలి ప్రధాని నెహ్రూ కాదని, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అని కేంద్ర మాజీ మంత్రి, కర్ణాటక భాజపా ఎమ్మెల్యే బసన్‌గౌడ్‌ పాటిల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

Published : 28 Sep 2023 16:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్న కేంద్ర మాజీ మంత్రి, కర్ణాటక భాజపా ఎమ్మెల్యే బసన్‌గౌడ పాటిల్‌ (Basangouda Patil) సరికొత్త వివాదానికి తెరలేపారు. భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ (Jawaharlal Nehru) కాదని, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ (Subhas Chandra Bose) అని ఆయన వ్యాఖ్యానించారు. కర్ణాటకలో నిర్వహించిన ఓ బహిరంగ సమావేశంలో పాటిల్‌ మాట్లాడుతూ.. ‘‘ మన దేశానికి జవహర్‌లాల్‌ నెహ్రూ తొలి ప్రధాని కాదు.. నేతాజీ సుభాష్‌ చంద్రబోసే ప్రథమ ప్రధాని’’ అని అన్నారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌.. బ్రిటిష్‌ వారికి భయం రుచిచూపించడం వల్లే వాళ్లు దేశాన్ని విడిచి వెళ్లిపోయారని చెప్పారు. భారతీయులు చేసే నిరాహార దీక్షల వల్లగానీ, సత్యం, ధర్మమంటూ ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించడం వల్లగానీ స్వాతంత్ర్యం రాలేదని, కేవలం బ్రిటిషర్లను భయపెట్టడం వల్లే స్వాతంత్ర్యం సిద్ధించిందని ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ తాను రాసిన ఓ పుస్తకంలోనూ ప్రస్తావించారని బసన్‌గౌడ గుర్తు చేశారు. 

‘‘ రెండో ప్రపంచయుద్ధం ముగిసిన తర్వాత బ్రిటిష్‌వాళ్లు భారత్‌ను విడిచిపెట్టారు. దేశంలోని కొన్ని ప్రాంతాలకు స్వాతంత్ర్యం కూడా ప్రకటించారు. ఆయా ప్రాంతాల వారికి సొంత కరెన్సీ, జెండా, జాతీయగీతం ఉండేవి. అప్పటికి దేశ ప్రధాని ఆజాద్‌ హింద్‌ఫౌజ్‌ను నడిపిస్తున్న సుభాష్‌ చంద్రబోస్‌. అందుకే మన తొలి ప్రధాని నెహ్రూ కాదు.. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అని ప్రధాని మోదీ కూడా చెబుతుంటారు’’ అని బసన్‌గౌడ వివరించారు. కర్ణాటకలో ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరేడు నెలల్లో కుప్పకూలిపోతుందంటూ గత ఆగస్టు నెలలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో జరిగే అవినీతిని భాజపా ప్రశ్నిస్తుందని, అంతర్గత పోరుతోనే కాంగ్రెస్‌ పతనమవుతుందని ఆయన వ్యాఖ్యానించి వార్తల్లో నిలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని