Nagaland: సీఎంగా నెఫ్యూ రియో రికార్డ్‌.. నాగా చరిత్రలో తొలి మహిళా మంత్రి

నాగాలాండ్‌ (Nagaland) ముఖ్యమంత్రిగా నెఫ్యూ రియో ఐదోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఇక రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఓ మహిళకు మంత్రి బాధ్యతలు అప్పగించడం విశేషం.

Published : 07 Mar 2023 16:45 IST

కోహిమా: ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌ (Nagaland) ముఖ్యమంత్రిగా ఎన్‌డీపీపీ (NDPP) నేత నెఫ్యూ రియో (Neiphiu Rio) వరుసగా ఐదోసారి ప్రమాణస్వీకారం చేశారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ లా గణేశన్‌ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi)తో పాటు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తదితరులు హాజరయ్యారు. రియోతో పాటు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. సోషల్‌ మీడియా ద్వారా ప్రధాని మోదీ సహా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నాగాలాండ్‌ భాజపా అధ్యక్షుడు తెమ్జెన్‌ ఇమ్నా అలోంగ్‌కు కేబినెట్‌లో మరోసారి చోటు దక్కింది.

‘తొలి’ మహిళకు.. మంత్రి బాధ్యతలు

ఇక.. ఈ ఎన్నికలు నాగాలాండ్‌ (Nagaland)లో సరికొత్త చరిత్రను లిఖించిన విషయం తెలిసిందే. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఇద్దరు మహిళలు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.  అందులో ఒకరైన సల్హౌతునో క్రుసెను మంత్రి వర్గంలోకి తీసుకోవడం విశేషం. ఎన్‌డీపీపీ పార్టీ తరఫున విజయం సాధించిన ఆమె.. నేడు కేబినెట్‌ మంత్రిగా ప్రమాణం చేశారు.

రియో.. ఐదోసారి..

72 ఏళ్ల నెఫ్యూ రియో (Neiphiu Rio) నాగాలాండ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఇది ఐదోసారి కావడం విశేషం. రాష్ట్రంలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి (Chief Minister)గా పనిచేసిన నేతగా ఆయన అరుదైన ఘనత సాధించారు. 2003లో రియో తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2008 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. అనంతరం 2008లో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. మరోసారి రియో సీఎం పగ్గాలు అందుకున్నారు. 2013 ఎన్నికల తర్వాత మూడోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఆ మరుసటి ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నాగాలాండ్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందడంతో సీఎం పదవిని వదులుకున్నారు. అలా 2014 నుంచి 2018 వరకు ఎంపీగా కొనసాగారు. అయితే, 2018లో మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. మరోసారి సీఎం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో (Assembly elections) ఆయన నేతృత్వం వహిస్తున్న ఎన్‌డీపీపీ-భాజపా (BJP) కూటమి మరోసారి విజయం సాధించడంతో ఐదోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు