Nellore: నేను ప్రతీకారం మొదలెడితే ఊహకు కూడా అందదు!: నెల్లూరు డిప్యూటీ మేయర్‌

నెల్లూరు డిప్యూటీ మేయర్‌ రూప్ కుమార్ యాదవ్ అనుచరుడు, వైకాపా విద్యార్థి నేత హాజీపై శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.

Updated : 20 May 2023 13:57 IST

నెల్లూరు: నెల్లూరు డిప్యూటీ మేయర్‌ రూప్ కుమార్ యాదవ్ అనుచరుడు, వైకాపా విద్యార్థి నేత హాజీపై శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ప్రస్తుతం హాజీ నెల్లూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హాజీని ఇవాళ రూప్‌కుమార్ యాదవ్‌ పరామర్శించారు. తన అనుచరుడిపై జరిగిన దాడిపై రూప్ కుమార్ యాదవ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

రూప్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ‘‘వైకాపా ఆవిర్భావం నుంచి హాజీ పార్టీలో ఉన్నారు. హాజీపై కత్తులతో హత్యాయత్నం చేశారు. కేవలం నాతో ఉన్నాడనే కక్షతోనే దాడి జరిగింది. బాధితుడు చెబుతున్నట్టు ఈ దాడి వెనుక స్థానిక ఎమ్మెల్యే అనిల్‌ కుమార్ యాదవ్‌ ఉన్నారు. ఇలాంటి దాడులు చేయడం మంచిది కాదు. గతంలోనూ నా అనుచరులపై దాడులు చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు చర్యలు తీసుకొని ఉంటే ఇవాళ మరోసారి దాడి జరిగి ఉండేది కాదు. ఇకపై మా కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదు. నేను ప్రతీకారం మొదలుపెడితే ఊహకు కూడా అందదు. ఈ ఘటనను సీఎం జగన్‌, పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తా. నెల్లూరులో వైకాపాను సర్వనాశనం చేస్తున్నారు’’ అని రూప్‌కుమార్ యాదవ్‌ వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్‌ తీరుపై ఆయన బాబాయ్‌ (డిప్యూటీ మేయర్) రూప్ కుమార్ యాదవ్ పద్యం రూపంలో విమర్శలు గుప్పించారు. వేమన పద్యాన్ని ఉదహరిస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

‘‘అల్పబుద్ధివానికధికారమిచ్చిన.. 

దొడ్డవారినెల్ల తొలగగొట్టు..

చెప్పుదినెడు కుక్క చెరకు తీపెరుగునా.. 

విశ్వదాభిరామ! వినుర వేమ!!’’... అని ధ్వజమెత్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని