Eknath Shindhe: మళ్లీ అలాంటివి జరగొద్దు.. ‘శిందే’సిన ఎమ్మెల్యేలపై సీఎం అసంతృప్తి

గోవాలోని హోటల్‌లో తన వర్గం ఎమ్మెల్యేలు డ్యాన్స్‌ చేసిన వ్యవహారంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shindhe) అసంతృప్తి వ్యక్తంచేశారు.......

Published : 01 Jul 2022 18:22 IST

పనాజీ: గోవాలోని హోటల్‌లో తన వర్గం ఎమ్మెల్యేలు డ్యాన్స్‌ చేసిన వ్యవహారంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shindhe) అసంతృప్తి వ్యక్తంచేశారు. ముంబయిలో నిన్న రాత్రి సీఎంగా ప్రమాణస్వీకారం అనంతరం శిందే శుక్రవారం తెల్లవారుజామున గోవాలోని డోనా పౌలాలోని హోటల్‌కు చేరుకున్న ఆయన ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఎమ్మెల్యేలంతా టేబుళ్లు ఎక్కి డ్యాన్సులు చేయడంపై శిందే అభ్యంతరం వ్యక్తంచేస్తూ తన అసంతృప్తిని తెలిపారని శివసేన రెబల్‌ ఎమ్మెల్యేల వర్గం అధికారప్రతినిధి దీపక్‌ కేసర్‌కర్‌ వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘‘ఎమ్మెల్యేలు అలా డ్యాన్స్‌ చేయడం తప్పేనని ఒప్పుకొంటున్నాం. ప్రజలతో ఎన్నికై, మహారాష్ట్ర అభివృద్ధి కోసం కృషిచేసే ఎమ్మెల్యేలకు ఇది మంచిది కాదు. హోటల్‌లో ఎమ్మెల్యేలతో మాట్లాడిన శిందే.. వారి డ్యాన్స్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని సూచించారు. ఆనంద క్షణాల్లో ఇలాంటి తప్పులు జరుగుతుంటాయి.. వాస్తవానికి అలాంటివి జరగకూడదన్నారు. మహారాష్ట్ర అభివృద్ధి కోసమే శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలంతా భాజపాతో చేతులు కలిపారు’’ అని కేసర్‌కర్‌ వివరించారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని ఏక్‌నాథ్‌ శిందే చేపట్టబోతున్న విషయం తెలియగానే ఆయన వర్గీయులైన ఎమ్మెల్యేలు గోవాలోని హోటల్‌లో ఆనందం పట్టలేక టేబుళ్లపైకెక్కి డ్యాన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ చేసిన ప్రకటనను టీవీలో వింటూనే వారు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. మరాఠీ పాటలకు అనుగుణంగా అక్కడే స్టెప్పులేశారు. అయితే, వారు డ్యాన్స్‌ చేసిన విధానంపై పలువురు నెటిజన్లు తప్పుబడుతూ అసభ్యకరంగా అభివర్ణించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని