Nimmala Ramanaidu: అన్నదాతలకు మంచిరోజులు తెస్తాం

గత ప్రభుత్వంలో రాష్ట్రానికి జరిగిన ప్రతి నష్టాన్నీ దార్శనికుడైన చంద్రబాబు చక్కదిద్దుతారని, అన్నదాతలకు మంచి రోజులు తీసుకొస్తారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

Published : 09 Jul 2024 05:02 IST

జలహారతి కార్యక్రమంలో మంత్రి రామానాయుడు   

ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్‌ పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మకు సారెను సమర్పిస్తున్న మంత్రి రామానాయుడు, ఎంపీ శివనాథ్, గుడివాడ ఎమ్మెల్యే రాము, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, తెదేపా నాయకులు తదితరులు 

ఈనాడు, అమరావతి, పవిత్రసంగమం(ఇబ్రహీంపట్నం), న్యూస్‌టుడే: గత ప్రభుత్వంలో రాష్ట్రానికి జరిగిన ప్రతి నష్టాన్నీ దార్శనికుడైన చంద్రబాబు చక్కదిద్దుతారని, అన్నదాతలకు మంచి రోజులు తీసుకొస్తారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మూడు రోజుల కిందట పోలవరం కాలువ నుంచి పట్టిసీమకు విడుదల చేసిన గోదావరి నీరు సోమవారం తెల్లవారుజామున ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్‌ పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మలో కలిసింది. ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్వహించిన జలహారతి కార్యక్రమంలో మంత్రి పాల్గొని కృష్ణమ్మకు పసుపు, కుంకుమతో పాటు చీర, సారెలను సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఐదేళ్లుగా రాష్ట్రంలోని ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. కరోనాతో పాటు కరవుతో రైతులు అల్లాడిపోయారని, కక్ష సాధింపులే తప్ప వైకాపా ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్, గుడివాడ ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ... కృష్ణా డెల్టా రైతాంగాన్ని ఆదుకోవడానికి.. చంద్రబాబు అధికారం చేపట్టిన నెలలోపే పట్టిసీమ నీటిని విడుదల చేయించారన్నారు. పట్టిసీమ పైపులను పీకేస్తానని చెప్పిన జగన్‌ నేడు పార్టీని పీకేసుకునే స్థితిలోకి వెళ్లారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు పాల్గొన్నారు.

పవిత్ర సంగమం ప్రాంతంలో పోలవరం కాలువ నుంచి గోదావరి జలాలు కృష్ణా నదిలో కలుస్తున్న అపురూప దృశ్యమిది. ఎర్రగా ఉన్నవి గోదావరి జలాలు.. ఆకుపచ్చ, నీలం రంగుల్లో కనిపిస్తున్నది కృష్ణా నీరు

కృష్ణమ్మ ఒడిలో గోదారమ్మ

కృష్ణా డెల్టా రైతుల వరప్రసాదిని పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను పోలవరం కాలువ గుండా తీసుకువచ్చి ఇబ్రహీంపట్నం ఫెర్రీఘాట్‌ వద్ద కృష్ణానదిలో కలుపుతున్నారు. సీఎం చంద్రబాబు ముందుచూపుతో గోదావరి జలాల్ని కృష్ణా ప్రాంతవాసులకు చేర్చి కృష్ణా డెల్టాను పంటలతో సస్యశ్యామలం చేసేందుకు గతంలో బాటలు వేశారు. వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో కొన్ని వేల ఎకరాలకు నీరులేక రైతులు నష్టపోయారు. మళ్లీ చంద్రబాబు సీఎం కాగానే... గోదావరి జలాల్ని విడుదల చేయడంతో ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమంలో కలుస్తూ జలకళను.. రైతుల కళ్లలో ఆనందాన్ని తీసుకొచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని