Opposition Parties Leaders: ప్రధానికి 9 మంది విపక్ష నేతల లేఖ

Opposition Parties Leaders: మనీశ్‌ సిసోదియా అరెస్టు, గవర్నర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ దేశంలోని తొమ్మిది మంది కీలక విపక్ష నాయకులు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

Updated : 05 Mar 2023 12:15 IST

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత మనీశ్‌ సిసోదియా (Manish Sisodia) అరెస్టును ఖండిస్తూ తొమ్మిది మంది విపక్ష పార్టీల నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (modi)కి లేఖ రాశారు. దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం వైపు పయనిస్తోందని లేఖలో ఆరోపించారు. ప్రతిపక్షాలపై ఇలాంటి చర్యలకు దిగడం నిరంకుశత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. లేఖ రాసిన వారిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR) సహా ఆప్‌ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, శివసేన యూబీటీ వర్గం నేత ఉద్ధవ్‌ ఠాక్రే, ఎస్పీ నాయకుడు అఖిలేశ్‌ యాదవ్‌ ఉన్నారు.

సిసోదియాపై చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని లేఖలో విపక్ష నేతలు పేర్కొన్నారు. కేవలం రాజకీయ కక్ష సాధింపుతోనే ఆయనను అరెస్టు చేశారని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారాలను ఈ విషయంలో దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారాలను బట్టి భాజపా నిరంకుశ పాలనలో భారత ప్రజాస్వామ్య విలువలకు ముప్పు ఏర్పడుతోందన్న విషయం ప్రపంచం అర్థం చేసుకుంటోందన్నారు.

2014లో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత దర్యాప్తు సంస్థల విచారణ ఎదుర్కొంటున్న రాజకీయ నాయకుల్లో అత్యధికం భాజపాయేతర పార్టీలకు చెందినవారేనని లేఖలో విపక్ష నాయకులు పేర్కొన్నారు. భాజపాలో చేరిన ప్రతిపక్ష నాయకులపై మాత్రం దర్యాప్తు వేగం నెమ్మదించిందని తెలిపారు. అందుకు అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మపై నమోదైన కేసులను లేఖలో ఉటంకించారు. దీన్ని బట్టి దర్యాప్తు సంస్థల విచారణలు పూర్తిగా రాజకీయ ఉద్దేశపూరితమైనవిగా స్పష్టమవుతోందన్నారు.

కేంద్ర దర్యాప్తు సంస్థలు సైతం ఈ విషయంలో తమ ప్రాధాన్యాలను మరచి వ్యవహరిస్తున్నాయని విపక్ష నేతలు ఆరోపించారు. ఒక సంస్థలో ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ పెట్టిన పెట్టుబడుల వల్ల సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున సంపదను కోల్పోయినట్లు తెలిపారు. పరోక్షంగా అదానీ-హిండెన్‌బర్గ్‌ ఉదంతాన్ని ప్రస్తావించారు. మరి సదరు సంస్థ ఆర్థిక పరిస్థితిపై దర్యాప్తు సంస్థలు ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు.

రాజ్యాంగానికి విరుద్ధంగా గవర్నర్లు..

మరోవైపు గవర్నర్ల వ్యవస్థపై వస్తున్న వివాదాలనూ విపక్ష నేతలు తమ లేఖలో ప్రస్తావించారు. గవర్నర్లు రాజ్యాంగ విధులకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన రాష్ట్రప్రభుత్వాల పాలనకు అడ్డుతగులుతున్నారన్నారు. అందుకు ఉదాహరణగా కొన్ని రాష్ట్రాల గవర్నర్లను ప్రస్తావించారు. వారు కేంద్రం, భాజపాయేతర పార్టీల పాలిత రాష్ట్రాల మధ్య పెరుగుతున్న దూరానికి కేంద్రబిందువుగా మారారన్నారు. తద్వారా సహకార సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారన్నారు. దీంతో దేశ ప్రజలు భారత ప్రజాస్వామ్యంలో గవర్నర్ల పాత్రనే ప్రశ్నించడం ప్రారంభించారన్నారు. 

కేంద్ర దర్యాప్తు సంస్థలు, గవర్నర్ల వంటి రాజ్యాంగబద్ధమైన పదవుల దుర్వినియోగాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని విపక్ష నేతలు పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచి చేయబోదని హితవు పలికారు. 2014 తర్వాత ఆయా వ్యవస్థలు వ్యవహరిస్తున్న తీరు వాటి ప్రతిష్ఠకు మచ్చ తెస్తోందన్నారు. పైగా వాటి స్వతంత్రత, నిష్పాక్షికతపై అనుమానాలు రేకెత్తిస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే శిరోధార్యమని గుర్తుచేశారు. వారి అభీష్టాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని