Nirmala Sitharaman: ‘రాహుల్‌జీ.. వాటిపై ఎందుకు పెదవి విప్పరు’?: సీతారామన్‌

ప్రధాని మోదీ(PM Narendra Modi)పై ప్రతిసారీ ఆధారాల్లేని ఆరోపణలు చేస్తూ.. పదే పదే తప్పులు చేసే వ్యక్తిలా రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) వ్యవహరిస్తున్నారని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌(Nirmala Sitharaman) విమర్శించారు. 

Updated : 11 Apr 2023 15:12 IST

బెంగళూరు: ప్రధాని మోదీ (PM Narendra Modi)పై ప్రతిసారీ నిరాధారమైన ఆరోపణలు చేయడం కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)కి అలవాటుగా మారిందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ (Niramala Sitharaman)మండిపడ్డారు. అదానీ (Adani)కి కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చేసిన మేలు గురించి రాహుల్‌ గాంధీ ఎందుకు మాట్లాడరు?అని ప్రశ్నించారు. ప్రతిసారీ ప్రధానిపై ఆధారాల్లేని ఆరోపణలు చేస్తూ.. పదే పదే తప్పులు చేసే వ్యక్తిలా రాహుల్‌ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆయన తప్పుల నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకోవడంలేదనే విషయం స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. 

‘‘కేరళ (Kerala)లో విళింజం పోర్ట్‌ (Vizhinjam Port)కాంట్రాక్ట్‌ను అదానీకి కాంగ్రెస్‌ పార్టీ పాలనలో పళ్లెంలో పెట్టి మరీ అప్పగించింది. ఈ కాంట్రాక్ట్‌కు సంబంధించి అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎలాంటి టెండర్‌ను ఆహ్వానించలేదు. మరి, ఆ కాంట్రాక్ట్‌ నిలిపివేయమని ఇప్పటి సీపీఎం ప్రభుత్వాన్ని రాహుల్‌ ఎందుకు కోరలేదు?రాజస్థాన్‌(Rajasthan)లో సోలార్‌ ప్రాజెక్ట్‌ (Solar Project)ను అదానీ సంస్థకు కాంగ్రెస్‌ పార్టీ కేటాయించింది. మరి, ఈ ప్రాజెక్ట్‌ కాంట్రాక్ట్‌ రద్దు చేయమని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని రాహుల్‌ ఎందుకు కోరలేదు? వీటిపై  మాట్లాడకుండా ఆయన్ను ఎవరు అడ్డుకున్నారు? 2013లో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను నాన్సెన్స్‌ అని విమర్శిస్తూ రాహుల్‌ గాంధీ చింపి చెత్తబుట్టలో పడేశారు. ఇప్పుడు కూడా రాజస్థాన్‌ ప్రభుత్వం అదానికీ ఇచ్చిన కాంట్రాక్ట్ కాపీలను చింపివేయకండా ఆయన్ను ఎవరు ఆపుతున్నారు? క్రోనీ కాపిటిలిజమ్‌ కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లోనే ఉంది’’ అని సీతారామన్‌ విమర్శించారు. 

కాంగ్రెస్‌ పార్టీ మాత్రం అదానీ వ్యవహారంపై జేపీసీ విచారణ పట్టాల్సిందేనని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తోంది. ఇందులో భాగంగా గురువారం  పార్లమెంట్ హౌస్‌ నుంచి విజయ్‌ చౌక్‌ వరకు ‘తిరంగా మార్చ్‌’ను నిర్వహించింది. మరోవైపు పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. సూరత్‌ సెషన్స్ కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలన్న అభ్యర్థనపై విచారణను ఏప్రిల్‌ 13కు వాయిదా వేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని