Prashant Kishor: నీతీశ్‌ కుమార్‌కు వయసు పైబడింది..: ప్రశాంత్‌ కిశోర్‌

బిహార్‌ ముఖ్య మంత్రి నీతీశ్‌ కుమార్‌పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నీతీశ్‌కు వయసు పైబడటంతో భ్రమలకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఆయన అర్థం లేని మాటలు మాట్లాడుతూ రాజకీయంగా ఏకాకిగా మారారని విమర్శించారు

Updated : 09 Oct 2022 14:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నీతీశ్‌కు వయసు పైబడడంతో భ్రమలకు గురవుతున్నారని ప్రశాంత్‌ కిశోర్‌ పేర్కొన్నారు. ఆయన అర్థం లేని మాటలు మాట్లాడుతూ రాజకీయంగా ఏకాకిగా మిగులుతున్నారని విమర్శించారు. వయసు కారణంగానే నీతీశ్‌ అసహనానికి లోనవుతున్నారని విశ్లేషించారు. ఇటీవల ప్రశాంత్‌ కిశోర్‌ చేపట్టిన జన్‌సురాజ్‌ పాదయాత్రను ఉద్దేశించి నీతీశ్‌ పలు రాజకీయ వ్యాఖ్యలు చేశారు. జనతాదళ్‌ యునైటెడ్‌లో చేరమని తాను కోరినట్లు ఆయన వెల్లడించారు. కానీ, ప్రశాంత్‌ భాజపా కోసం పనిచేస్తున్నట్లు ఆరోపించారు. 

ఈ ఆరోపణలపై తాజాగా ప్రశాంత్‌ కిశోర్‌ స్పందిస్తూ.. ‘‘నేను భాజపా అజెండాపై పనిచేస్తున్నానని చెబుతూనే.. నేను ఆయన్ను కాంగ్రెస్‌తో కలవమని చెబుతున్నానన్నారు. ఇదెలా సాధ్యం..?  నేను భాజపాకు పనిచేస్తే.. కాంగ్రెస్‌ను బలోపేతం చేయమని ఎందుకు చెబుతాను? రెండో విషయం నిజమైతే.. మొదటి విషయం తప్పని అర్థం. ఆయనకు వయసు మీదపడి భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆయన తన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులనే నమ్మలేని స్థితిలో ఉన్నారు. రాజకీయ ఏకాకిగా మారారు. ఆ అసహనంతోనే ఆయన అలా మాట్లాడుతున్నారు’’ అని ఆరోపించారు. 

శనివారం బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ప్రశాంత్‌ కిశోర్‌ ఆధారరహిత ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. కొన్నేళ్ల క్రితం జేడీ(యూ)ను కాంగ్రెస్‌తో కలపాలని ప్రశాంత్‌ సూచించినట్లు వెల్లడించారు. మరోవైపు అక్టోబర్‌ 5వ తేదీన ప్రశాంత్‌ మాట్లాడుతూ.. నీతీశ్‌ కుమార్‌ తనను కార్యాలయానికి పిలిపించి.. పార్టీలో చేరాలని కోరినట్లు వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని