Nitish Kumar: ప్రధాని అభ్యర్థిత్వంపై పార్టీ కార్యకర్తలకు నీతీశ్‌ విజ్ఞప్తి!

విపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థిత్వంపై బిహార్‌ (Bihar) ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar) మరోసారి స్పష్టతనిచ్చారు. ఆ పదవిపై తనకు ఆసక్తి లేదని, విపక్షాలన్నింటినీ ఏకం చేయడమే తనముందున్న లక్ష్యమన్నారు.

Published : 17 Feb 2023 01:46 IST

పట్నా: ప్రధాని పదవిపై తనకు ఏ మాత్రం ఆసక్తి లేదని అన్నారు బిహార్‌ (Bihar) ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ (Nitish Kummar). సమాధాన్‌ యాత్రలో భాగంగా పార్టీ కార్యకర్తలు  2024 ఎన్నికల్లో (2024  Lok sabha Elections) మహాఘట్‌బంధన్‌ ప్రధాని అభ్యర్థి అంటూ నినాదాలు చేశారు. దీనిపై నీతీశ్‌ స్పందిస్తూ.. తనను ప్రధాని అభ్యర్థిగా చూడొద్దని, ఆ పదవిపై తనకు ఆసక్తి లేదని పార్టీ కార్యకర్తలకు స్పష్టం చేశారు. ‘‘ఇప్పటికే నేను పలుమార్లు ఈ విషయంపై స్పష్టతనిచ్చాను. నాకు ప్రధాని కావాలనే కోరిక లేదు’’ అని చెప్పారు. మరోవైపు, నీతీశ్‌ ప్రధాని అభ్యర్థిత్వంపై బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav) స్పందించారు. ‘‘ ఆయన బిహార్‌కు ముఖ్యమంత్రి. ఆయన మార్గదర్శకత్వంలో మేమంతా పనిచేస్తున్నాం. ప్రస్తుతం ఆయన ఏకైక అజెండా విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడమే’’ అని అన్నారు. 

ప్రస్తుతం నీతీశ్‌ కుమార్ రాష్ట్రవ్యాప్తంగా సమాధాన్‌ యాత్ర చేపట్టారు. జనవరి 5న ప్రారంభమైన ఈ యాత్ర 18 జిల్లాల్లో సాగనుంది. గత 18 ఏళ్లలో రాష్ట్రంలో చేపట్టిన పనులపై ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు ఈ యాత్ర చేపట్టినట్లు నీతీశ్‌ చెప్పారు. గత నెలలో ఖమ్మంలో భారాస నిర్వహించింది. సభ జరిగిన మరుసటి రోజే నీతీశ్‌ విపక్ష పార్టీల ఐక్యతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి కలిసి ముందుకెళ్తే చూడాలని ఉందన్నారు. ప్రస్తుతం అదొక్కటే తనకున్న కోరిక అని చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష నేతలంతా ఏకమై ముందుకు సాగడంతోనే దేశానికి మేలు జరుగుతుందని అప్పట్లో నీతీశ్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని